
శనగ విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలం
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
హాలహర్వి: రబీ సీజన్ ప్రారంభంకావొస్తున్నా నేటికీ రైతులకు పప్పుశనగ విత్తనాలను సబ్సిడీలో అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు శనగ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. హాలహర్వి, చిప్పగిరి మండలాల్లో ఎక్కువగా పప్పుశనగను సాగు చేస్తారన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో సెప్టెంబర్ చివరి వారానికే సబ్సిడీ శనగ విత్తనాలు రైతులకు అందేవన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందన్నారు. సకాలంలో సబ్సిడీ శనగ విత్తనాలను అందించని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
27న అంతర్జాతీయ బధిరుల దినోత్సవం
కర్నూలు(అర్బన్): అంతర్జాతీయ బధిరుల దినోత్సవాన్ని ఈ నెల 27న ఉదయం 10 గంటలకు స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని బధిరుల సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, బ్యాంకు తదితర శాఖలకు చెందిన ఉద్యోగులందరూ హాజరు కావాలని కోరారు. బధిర ప్రభుత్వ ఉద్యోగులకు ఓడీ సౌకర్యం ఉందనే విషయాన్ని తమ అధికారులకు తెలియజేసి కార్యక్రమంలో పాల్గొనాలని ఏడీ పేర్కొన్నారు.