
నేటి నుంచి డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నేటి నుంచి డిజిటల్ రేషన్ కార్డులను అక్టోబర్ 1వ తేదీ వరకు సచివాలయాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు జేసీ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాల యంలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డులను డీఎస్‌ఓ ఎం.రాజారఘువీర్‌తో కలసి పరిశీలించారు. జిల్లాలకు మొత్తం 6,68,944 కార్డులు వచ్చాయన్నారు. వీటిని సచివాలయాల్లో నేటి నుంచి, అక్టోబర్ 2వ తేదీ నుంచే రేషన్ షాపుల్లో వీటిని తీసుకోవచ్చని వినియోగదారులకు సూచించారు. ప్రజలు తమకు సమీపంలోని సచివాలయాలను సందర్శించి డిజిట ల్ రేషన్ కార్డులను ఉచితంగా తీసుకోవచ్చన్నారు.
నిండుకుండలా జీడీపీ
గోనెగండ్ల: మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి హంద్రీనదికి నీటి విడుదలను గురువారం ఉదయం నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు గత మూడు రోజుల నుంచి జీడీపీ నీటిని హంద్రీనదికి విడుదల చేశారు. గురువారం ఉదయం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వరద నీటి ప్రవాహం తగ్గడంతో క్రస్ట్ గేటును మూసివేశారు. పూర్తిస్థాయి సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జీడీపీలో 4.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలి
నంద్యాల(న్యూటౌన్): పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలను విడుదల చేయాలని, నాలుగు డీఏలను ఇవ్వాలని, మధ్యంతర భృతి 30శాతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీటీఎఫ్ 257 సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివయ్య, రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కార్యాలయంలో నంద్యాల మండలం ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికై న మండల అధ్యక్ష కార్యదర్శులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాడాలన్నారు. ఎన్నికల అధికారులుగా రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ భాస్కరరెడ్డి, శ్రీనివాసులు వ్యవహరించారు.
నూనె గింజల ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించాలి
ఎమ్మిగనూరురూరల్: నూనె గింజల ఉత్పత్తి పెంపుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మీ అన్నారు. గురువారం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ నూనె గింజల అభివృద్ధి పథకంలో భాగంగా కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్రచౌదరి ఆధ్వర్యంలో రైతులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మీ మాట్లాడుతూ..
భారతదేశం సంవత్సరానికి సగటున 16 మిలియన్ టన్నుల నూనె గింజలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందన్నారు. దీతో లక్షల కోట్లు రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని, నూనె గింజల ఉత్పత్తి పెంపుతో దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునిస్తుందన్నారు. ఎఫ్‌పీవోలకు నాణ్యమైన విత్తనాలను అందించి విత్తనోత్పత్తి పెంపుతోపాటు నూనె గింజనల ఉత్పత్తి పెరగటానికి ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ మహమ్మద్‌ఖాద్రి, ఎమ్మిగనూరు, గోనెగండ్ల ఏవోలు శివశంకర్, హేమలత, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.