
బాల్య వివాహాలు చేస్తే శిక్ష తప్పదు
కర్నూలు: బాల్య వివాహాలు చేసిన వారికి, చేయించిన వారికి శిక్షలు తప్పవని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో గురువారం ‘బాల్య వివాహ నిరోధక చట్టం’పై పురోహితులు, పాస్టర్లు, ప్రభుత్వ ఖాజీలు, దేవాలయ ఏఓలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలు జరిపించాలని ఎవరైనా మీ దగ్గరకు వస్తే సంబంధిత శాఖలకు, 15100 టోల్ ఫ్రీ నంబర్‌కు కానీ సమాచారం ఇస్తే వెంటనే నిలుపుదల చేయిస్తామన్నారు. బాల్య వివాహాలు చేసినవారికి రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఐసీడీఎస్ అధికారి శారద మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కమిటీలు ఉన్నాయని, బాల్య వివాహాలపై సమాచారం ఇస్తే వెంటనే ఆ వివాహాన్ని నిలుపుదల చేసి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం, కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కంచుగంటల శ్యాం సుందర్, రవిచంద్రవర్మ, చైల్డ్ రైట్స్ ఎన్‌జీఓ మౌనిక తదితరులు పాల్గొన్నారు.