
కేసుల ఛేదన వేగవంతానికి చర్యలు
కర్నూలు: కేసుల ఛేదనను వేగవంతం చేసేందుకు ప్రతి పోలీస్ సబ్ డివిజన్‌కు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను ఏర్పా టు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయడంతో పాటు నిందితులకు శిక్షలు పడేలా క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు పనిచేయాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి బేసిక్ పోలీసింగ్ పాటించాలని, జీరో ఎఫ్‌ఐఆర్, ఈ–ఎఫ్‌ఐఆర్, ఈ–సాక్ష యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. అర్హత ఉన్న కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై గట్టి నిఘా ఉంచాలని సూచించారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు నాలుగు వారాల పాటు రోడ్డు భద్రతపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గస్తీ తిరిగేటప్పుడు మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ పరికరంతో అనుమానితుల వేలిముద్రలు సేకరించాలన్నారు. గత నెలలో వివిధ కేసులలో ప్రతిభ కనపర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబు ప్రసాద్, వెంకటరామయ్య, భార్గవి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.