
ప్రాణం తీసిన ఈత సరదా
● బావిలో మునిగి ఇంటర్ విద్యార్థి మృతి
కర్నూలు: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. కర్నూలు మండలం నూతనపల్లె గ్రామానికి చెందిన జయంతి, వెంకటేశ్వర్లు దంపతుల కుమారుడు శ్రీనివాసులు(17) కర్నూలు మండలం పసుపల–రుద్రవరం గ్రామాల మధ్య ఉన్న పొలంలోని బావిలో సరదాగా ఈత కొట్టేందుకు దిగాడు. సరిగ్గా ఈత రాకపోవడంతో మునిగి మృతిచెందాడు. తల్లి జయంతి దుబాయ్‌లో నర్సుగా పనిచేస్తుండగా తండ్రి వెంకటేశ్వర్లు కర్ణాటకలో పాలిష్ కట్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కొడుకు, కూతురు సంతానం. ఇద్దరు కూడా నాయనమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నారు. శ్రీనివాసులు పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు ఎదురుగా ఉన్న సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ ఇంటర్మీడియట్ హెచ్‌ఈసీ చదువుతున్నాడు. బుధవారం స్నేహితులు ఈదుర్ బాషా, గణేష్, నవీన్, చంద్రహాస్‌లతో కలసి పసుపుల సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు. స్నేహితులందరూ నీటిలోకి దిగి ఈత కొడుతుండగా తనకు కూడా కొద్దిగా ఈత వచ్చని స్నేహితులకు చెప్పి వారితో సరదాగా గడిపేందుకు నీటిలోకి దిగి మునిగిపోయాడు. ఎంత సేపటికీ నీటిలో నుంచి తేలకపోవడంతో స్నేహి తులు భయాందోళనకు లోనై పరిగెత్తుకుంటూ వెళ్లి కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బావిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చు రీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు కర్నూలుకు చేరుకున్నారు. అయితే విద్యార్థి శ్రీనివాసులు పెదవులు, చెవుల వద్ద చాపలు కొరికిన గాట్లు ఉన్నాయి. వాటిని చూసి స్నేహితులే ఏదో చేశారని, అందుకే తన కుమారుడు మృతిచెందాడని తల్లి జయంతి అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.