
డీఏనా.. ఆ ఒక్కటీ అడగొద్దు!
పెండింగ్ డీఏల వివరాలు ఇలా ఉన్నాయి (ఇప్పుడు తీసుకుంటున్న డీఏ 33.67 శాతం)
దసరా.. హిందువులకు అతి పెద్ద పండుగ. ఎక్కడెక్కడో స్థిరపడిన వారందరూ సొంత ఊర్లకు వచ్చి కుటుంబ సభ్యులతో పండుగ చేసుకుంటారు. దసరాకై నా కనీసం ఒక్క డీఏ అయినా ఇస్తారా అని ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ‘డీఏనా.. ఆ ఒక్కటీ అడగొద్దు’ అన్నట్లు వ్యవహరిస్తోంది.
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ప్రతి నెలా రూ.10 వేల వరకు నష్టపోతున్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 2024 జూన్ నెలలో బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 16 నెలల కాలంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. ఓపిక పట్టాలనే ఉద్దేశంతో కొన్ని నెలల పాటు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. నెలలు గడుస్తున్నప్పటికీ బకాయిలు చెల్లించడంలో ఉద్యోగుల్లో సహనం నశిస్తోంది. మొదటి విడతలో వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు రెండో విడతలో నిరసనలు మరింత తీవ్రం చేయనున్నారు.
రోడ్డెక్కుతున్న ఉద్యోగులు
కూటమి ప్రభుత్వంపై ఉన్న భ్రమలు ఉద్యోగుల్లో తొలగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు ఉద్యమ శంఖారావం పూరించారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. పబ్లిక్ సెక్టారు కంపెనీ అయిన ఏపీఎస్‌పీడీసీఎల్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు నిరసన గళం వినిపించారు. ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉద్యమం చేసే యోచనలో ఉన్నారు. మొన్నటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడే ఉద్యోగులు నేడు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో పాటు దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు బహిరంగంగా నిరసన గళం విప్పుతున్నాయి. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్.. చంద్రబాబు భజనలో తరిస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఉమ్మడి జిల్లాలో బకాయిలు
రూ.3 వేల కోట్లు
కర్నూలు జిల్లాలో 25,895, నంద్యాల జిల్లాలో 20,282 మంది ఉద్యోగులు ఉన్నారు. పబ్లిక్ సెక్టారుకు చెందిన ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో మరో 10 వేల మంది వరకు ఉన్నారు. 1వ తేదీ వేతనాలు ఇవ్వడం మినహా ఎలాంటి ప్రయోజనం లేదనే అసంతృప్తితో ఉద్యోగులు రగిలిపోతున్నారు. కూటమి ప్రభుత్వంపై ఒక్క ఉద్యోగి కూడా సంతృప్తితో లేదనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు ఆర్థిక శాఖ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు రూ.3 వేల కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వంలో ఇవీ కష్టాలు..
● ఏపీజీఎల్‌ఐ లోన్, పైనల్ పేమెంట్లు పూర్తిగా
నిలిచిపోయాయి.
● 10 నెలలుగా మెడికల్ రీయింబర్స్‌మెంటు
బిల్లులు ఇవ్వడం లేదు.
● మూడు సరండర్ లీవ్‌లు పెండింగ్‌ల
ఉన్నాయి.
● 2024 అక్టోబరు నుంచి ఉద్యోగ విరమణ చేసిన
ఉద్యోగులకు గ్రాడ్యుటీ ఇవ్వడం లేదు.
● పది నెలల ఎన్‌క్యాస్‌మెంట్ ఆప్ లీవ్‌లు
పెండింగ్‌లోనే ఉన్నాయి.
● డీఏ అరియర్, పీఆర్‌సీ అరియర్స్ పెండింగ్‌లో
ఉండిపోయాయి.
● కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు
అవుతున్నా ఐఆర్ ఊసే లేదు.
● 12వ పీఆర్‌సీ గురించి ఆలోచించిన
దాఖలాలే లేవు.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..
● 2019లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు 27 శాతం మద్యంతర భృతి(ఐఆర్) ఇచ్చారు.
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 12వ పీఆర్‌సీ కమీషన్ ఏర్పాటు చేసింది. ఈ కమీషన్ తన పని మొదలు పెట్టే సమాయానికి ఎన్నికల నోటిఫికేన్ రావడంతో నిలిచిపోయింది. తదనంతరం పీఆర్‌సీ కమీషన్ చైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతోంది. ఇంతవరకు ఉద్యోగ, ఉపా ధ్యాయ కార్మికుల పెండింగ్ బకాయిలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి ఫెడరేషన్‌గా ఏర్పడ్డాయి. ఇదివరకే జిల్లాస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. వచ్చే నెల 7వ తేదీన రాష్ట్రస్థాయిలో పద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.
– హృదయరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,
ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య
విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి 2024 జనవరి 1 నుంచి ఇప్పటివరకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలవుతున్నా ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడం దారుణం. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఒక్కో ఉద్యోగి సగటున రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టపోతున్నారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై మొదటి దశ ఆందోళన కార్యక్రమాలు పూర్తి చేశాం. త్వరలోనే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం.
– సతీష్ కుమార్, ఉమ్మడి జిల్లా చైర్మన్,
ఏపీ పవర్ ఉద్యోగుల జేఏసీ
రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు(ఫైల్)
2024 జనవరిలో 3.64 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది ( 33.67 శాతం నుంచి 37.31 శాతం)
2024 జూలైలో 2.73 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది.( 37.31 శాతం నుంచి 40.04 శాతం)
2025 జనవరిలో 1.82 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది.( 40.04 శాతం నుంచి 41.86 శాతం)
2025 జూలై 2.73 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది. (41.86 శాతం నుంచి 44.59 శాతం)
ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 డీఏల మొత్తం 10.92 శాతం
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
ఒక్క డీఏ కూడా ఇవ్వని వైనం
రోడ్డెక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
ప్రతి నెలా రూ.10 వేలు నష్టపోతున్న
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు
ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల బకాయిలు
రూ.3,000 కోట్లు పైమాటనే!