
దొంగతో జతకట్టి పోలీసు చోరీలు
ఏపీఎస్పీ కానిస్టేబుల్ బాగోతం
కర్నూలు: ఆయనో కానిస్టేబుల్. బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ దొంగతో దోస్తీ కట్టాడు. తన ద్విచక్ర వాహనంపై దొంగను కూర్చోబెట్టుకొని నగరంలో తిరుగుతుంటాడు. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు అక్కడ దొంగను రంగంలోకి దించుతాడు. బయట తాను గస్తీ పోలీసుననే ఫోజు ఇస్తాడు. పని పూర్తి కాగానే ఇద్దరూ కలసి లక్ష్మీ టౌన్‌షిప్‌లోని కానిస్టేబుల్ ఇంటికి చేరుకుంటారు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బును పంచుకుంటారు. మోస్ట్ వాంటెడ్ గజదొంగ జగదీష్‌ను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కానిస్టేబుల్ ఎద్దుల కృపానందం బాగోతం వెలుగులోకి వచ్చింది.
కారు డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు
కల్లూరులోని తెలుగు వీధిలో నివాసముంటున్న కార్ డ్రైవ్ గురుస్వామి ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలసి వృత్తి రీత్యా బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో దాచిన 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు మూటగట్టుకుని ఉడాయించారు. ఈ మేరకు బాధితుడు గురుస్వామి నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ విక్రమసింహ, ఎస్‌ఐ చంద్రశేఖర్ రెడ్డి క్రైం పార్టీ సిబ్బందితో కలసి దర్యాప్తులో భాగంగా నగర శివారులో విజయవాడకు చెందిన దొంగ జగదీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా కానిస్టేబుల్ దోస్తీ వ్యవహారం వెలుగు చూసింది. జగదీష్‌పై 25కు పైగా చోరీ కేసులు ఉన్నాయి.
ఫోన్ కాల్ డేటా ఆధారంగా వెలుగులోకి..
దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో జైలు నుంచి రిలీజైన నిందితుల వివరాలను పోలీసులు సేకరించారు. కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కానిస్టేబుల్ కృపానందం సెల్‌ఫోన్‌కు గజదొంగ జగదీష్ నుంచి తరచూ ఫోన్లు వచ్చినట్లు కాల్ డేటా సేకరించారు. కల్లూరులోని గురుస్వామి ఇంట్లో దొంగతనం జరిగిన రోజు విజయవాడకు చెందిన జగదీష్ కదలికలు ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించి విచారించడంతో వారి మధ్య ఉన్న బంధం బయటపడింది. విధి నిర్వహణలో భాగంగా కృపానందం విజయవాడకు వెళ్లినప్పుడు అక్కడ గార్డు డ్యూటీ విధుల్లో ఉండగా జగదీష్ పరిచయమయ్యాడు. అది కాస్తా స్నేహంగా మారి తరచూ కర్నూలుకు వస్తూ కానిస్టేబుల్ ఇంట్లోనే ఉంటూ ఇద్దరూ కలసి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెలుగుచూసింది. ఇలా కర్నూలు నగరంలో ఇద్దరూ కలసి పలు ఇళ్లల్లో చోరీలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. నిందితుల నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. 2007లో కృపానందం ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు.
మద్యం మత్తులో యువకులపై దాడి చేసి సస్పెన్షన్
● కర్నూలులోని బళ్లారి చౌరస్తా సమీపంలో మద్యం మత్తులో ఇద్దరు మైనర్ యువకులతో గొడవ పడిన ఘటనలో బెటాలియన్ అధికారులు కృపానందంపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారు.
● విచారణ జరుగుతుండగానే ఈ ఏడాది ఆగస్టులో కంబం పోలీసులు కృపానందంను చోరీ కేసులో అరెస్టు చేసి గిద్దలూరు జైలుకు పంపారు.
● బెయిల్‌పై బయటకు వచ్చి జగదీష్‌తో కలసి కర్నూలులో మళ్లీ ఇళ్ల దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో అంగీకరించాడు.
● నేరానికి ఉపయోగించిన కృపానందం పల్సర్ మోటార్‌బైక్‌ను సీజ్ చేసి ఇరువురినీ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు.
● కేసును సాంకేతికత ఆధారంగా ఛేదించిన ఎస్‌ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ షాకీర్, కానిస్టేబుళ్లు ఎల్లా శివుడు, సుబ్బరాయుడులను సీఐ అభినందించారు.
తన బైక్‌పైనే తిప్పుతూ
తాళం వేసిన ఇళ్ల గుర్తింపు
చోరీ సొత్తు సొమ్ము చేసుకొని భాగాలు
మోస్ట్ వాంటెడ్ దొంగ జగదీష్‌పై
25కు పైగా కేసులు
ఇప్పటికే ఓ కేసులో అరెస్టయిన
కానిస్టేబుల్
బెయిల్‌పై వచ్చి
విజయవాడ దొంగతో దోస్తీ