
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి
కర్నూలు(సెంట్రల్): రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పోలీసులు ప్రతిపాదించిన 84 అప్రోచ్‌రోడ్లను నిర్మించాలని ఆదేశించారు. ఎల్లమ్మ దేవాలయం దగ్గర అప్రోచ్ రోడ్డు పనులు నెలలోపు పూర్తి చేయాలన్నారు. పెద్దపాడు నుంచి హైవే వరకు నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదలను అక్టోబర్ 10 లోగా ప్రభుత్వానికి పంపాలన్నారు. ఉల్చాలరోడ్డు, గాయత్రీ ఎస్టేట్‌లలో జంక్షన్ పనులను త్వరగా చేపట్టాలన్నారు. కర్నూలు నగరంలో సుందరీకరణ పనులపై ఆరా తీశారు.
కర్నూలులో మరో 135 సీసీ కెమెరాలు
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. ఆదోని, మంత్రాలయం, ఆలూరు ప్రాంతాలోని ఆర్‌అండ్‌బీ రోడ్లలో రాత్రిపూట వెలుతురు ఇచ్చే రోడ్ స్టడ్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కర్నూలులో సీసీ కెమెరాల నిర్వహణను బా ధ్యతను మునిసిపల్ శాఖ తీసుకోవాలని, మరో 135 సీసీ కెమెరాలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, కర్నూలు మునిసిపల్ కమిషనర్ విశ్వనాథ్, డీటీసీ శాంతకుమారి పాల్గొన్నారు.