
సమ్మెకు సిద్ధమైన పీహెచ్‌సీ వైద్యులు
కర్నూలు(హాస్పిటల్): దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.శాంతికళలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఫలితం లేకపోయిందన్నారు. దీంతో తాము నిరసనకు దిగక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నిరసన ప్రజలపై కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాత్రమేనన్నారు. కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ తాము ప్రజా సేవకు వెనకడుగు వేయలేదని, అయినప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం మరుగున పడేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న సమ్మె కార్యాచరణ ప్రకటించి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు.