
ప్రతి విద్యా సంస్థలో ఈగల్ బృందాలు
కర్నూలు(సెంట్రల్): యూనివర్సిటీ మొదలు పాఠశాలల వరకు ప్రతి విద్యా సంస్థలో ఈగల్‌టీం(బృందాలు)లను సోమవారంలోపు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. జూనియర్ కాలేజీలు, పాఠశాలల ఈగల్ టీంలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉండేలా చూసుకోవాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్‌సీఓఆర్‌డీ సమావేశాన్ని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు, విద్యార్థుల సాయంతో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో నిఘా వేయవచ్చన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో అనారోగ్యం బారిన పడతారని, కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడతాయనే విషయాన్ని ఈగల్ టీంల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. పంట పొలాల్లో గంజాయి పెంచకుండా తగిన నిఘా ఉంచాలని వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం పోలీసు శాఖ మత్తు పదార్థాల వినియోగం, రవాణాను అరికట్టడంపై ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలు, వీడియోలను ఆవిష్కరించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని 250 పాఠశాలల్లో ఈగల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి శుక్రవారం పాఠశాలల్లో మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యా సంస్థలకు సూచించినట్లు చెప్పారు. ఆదోని మండలం పెద్దతుంబళంలో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తుండడంతో గుర్తించామని, సుమారు 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, కర్నూలు మునిసిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సబీహపర్వీన్, డీటీసీ శాంతకుమారి, ఆర్టీసీ ఏఓ సుధారాణి, డిజేబుల్డ్ ఏడీ ఫాతిమా సుల్తానా, జేడీఏ వరలక్ష్మీ, డీఎంహెచ్‌ఓ శాంతికళ, ఎకై ్సజ్ సూపరింటెంటెండ్ సుధీర్‌బాబు, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన, ఆర్‌ఐఓ లాలెప్ప, సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక, లేబర్ డీసీ వెంకటేశ్వర్లు, క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అఖీరాబాను పాల్గొన్నారు.