
వివాదం రాజేసిన చేపల వేట
ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత
అవుకు(కొలిమిగుండ్ల): చేపల వేట కోసం రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. బుధవారం మెట్టుపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలోని గాలేరు నగరి కాల్వకు ఎగువ నుంచి నీటి విడుదల సామర్థ్యాన్ని ఇటీవల అధికారులు తగ్గించారు. దీంతో మెట్టుపల్లె, కోనాపురం గ్రామాలకు చెందిన కొంత మంది వ్యక్తులు గాలేరు నగరి కాల్వలో దిగి చేపలు పట్టుకుంటున్నారు. పది నుంచి ఇరవై కేజీల బరువున్న చేపలు కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్‌లోకి చేరుతుంటాయి. కొద్ది రోజుల నుంచి రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులు చేపలు పట్టుకొని బనగానపల్లెకు చెందిన వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నాలుగు టన్నుల వరకు చేపలను విక్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా బుధవారం టన్నుకు పైగానే చేపలు పట్టు కొని ఆటోలో తరలించేందుకు సిద్ధం చేశారు. ఈ విష యం తెలుసుకున్న అవుకు పట్టణానికి చెందిన బెస్త సంఘం నాయకులు గాలేరు నగరి కాల్వ వద్దకు చేరుకున్నారు. చేపలు పట్టుకునే హక్కు తమకు మాత్రమే ఉందని వాదించారు. అయితే తమ గ్రామ పొలిమేర కాబట్టి తమకు మాత్రమే హక్కు ఉందని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడంతో ఒకరికొకరు స్వల్పంగా తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కాల్వ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాల వాదనలు విని సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎవరూ చేపలు పట్టరాదని సూచించారు. ఆటో లో ఉన్న చేపలను స్టేషన్‌కు తరలించారు. సీఐ మంజునాథరెడ్డి అవుకు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులతో పాటు అవుకు బెస్త సంఘం నాయకులతో చర్చించారు. కాగా చివరకు ఆ ప్రా ంతం చేపల వేటకు నిషేధమని, ఎవరూ చేపలు పట్ట కూడదని తేల్చి చెప్పారు.ఆటోలో ఉన్న చేపలను అప్పటికే కొనుగోలు చేసిన వ్యాపారులకు అప్పగించారు.

వివాదం రాజేసిన చేపల వేట