
విజయవాడకు బయలుదేరిన కొత్త సారోళ్లు
● ఉమ్మడి జిల్లా నుంచి 123 బస్సుల్లో తరలింపు ● జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్
కర్నూలు సిటీ: డీఎస్సీ–2025లో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకునేందుకు బుధవారం విజయవాడకు తరలివెళ్లారు. వీరంతా గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలో నియామకపత్రాలు అందుకోనున్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులు, వారికి ఒకరి చొప్పున సహాయకులను రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న 2,805 మంది నూతన ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించామన్నారు. 123 బస్సుల్లో ప్రతి బస్సుకు ఒక పోలీసు ఎస్కార్ట్, మెడికల్ కిట్లు ఏర్పాటు చేశామన్నారు. పర్యవేక్షణకు పది బస్సులకు ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. రాత్రి విడిది కోసం ప్రత్యేకంగా మహిళలు, పురుషులకు వేర్వేరుగా నరసరావుపేట, గుంటూరులో బస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత అదే బస్సుల్లోనే అభ్యర్థులను జిల్లా కేంద్రానికి తీసుకొస్తామన్నారు. కాగా చంటి పిల్లలు ఉన్న తల్లులు ఎంతో అవస్థలు పడ్డారు. వాతావరణం చల్లగా ఉండడంతో పిల్లలతో సుదూర ప్రయాణం చేయాల్సి రావడంతో ఆందోళన చెందారు. అయితే నియమాక పత్రాలు జిల్లాకు ఇద్దరికి మాత్రమే వేదికపై ఇస్తారని ప్రయాణంలో తెలియడంతో అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రచారం కోసం ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబు అని బస్సుల్లో ఉన్న అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.