
సీడీపీఓ వేధింపులపై విచారణ
ఆలూరు రూరల్: ఆలూరు సీడీపీఓ నరసమ్మ వేధిస్తున్నారని కురువళ్లి అంగన్‌వాడీ టీచర్ భువనేశ్వరి ఆరోపణలపై జిల్లా ఐసీడీఎస్ పీడీ విజయ విచారణ చేపట్టారు. ఈ నెల 6వ తేదీన సీడీపీఓ కురువళ్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్‌లో వివరాలు లేకపోవడంతో టీచర్‌ను నిలదీసి, రూ. 4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశా రని, ఇవ్వలేకపోవడంతో వేధిస్తు న్నారని అంగన్ వాడీ టీచర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీడీ విజయ బుధవారం ఆలూరుకు చేరుకుని సీడీపీఓ, సూపర్ వైజర్, అంగన్‌వాడీటీచర్, ఆయాను విచారించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు.
సబ్ జైలు తనిఖీ
డోన్ టౌన్: పట్టణంలోని సబ్ జైలును బుధవారం జిల్లా లీగల్ సర్వీసు అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు పరిసరాలను, వంట గదిని పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఏ ఏ నేరాలపై జైలుకు వచ్చారు? బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారా? ఎవ్వరైన 70 ఏళ్ల పైబడిన వయస్సు వారు ఉన్నారా? అంటూ అరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జైలులో వసతులు, భోజనం, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగారు. బెయిలు కోసం స్వతహాగా దరఖాస్తు చేసుకోవడానికి ఆర్ధిక స్థోమత లేక పోతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు పెట్టకోవాలని సూచించారు. ఈయన వెంట పట్టణ సీఐ ఇంతియాజ్‌బాషా, లీగల్ అడ్వయిజర్ మాధవస్వామి తదితరులు ఉన్నారు.

సీడీపీఓ వేధింపులపై విచారణ