
ఎస్సీ యువతకు ఆర్టీసీలో డ్రైవింగ్ శిక్షణ
కర్నూలు(అర్బన్): జిల్లాలోని షెడ్యూల్డు కులాల సేవా ఆర్థిక సహకార సంస్థ ద్వారా ఎంపికై న షెడ్యూల్డు కులాలకు చెందిన యువతకు హెవీ మోటారు వెహికల్ డ్రైవింగ్ శిక్షణను ఆర్టీసీలో ఇప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఈఓ విజయలక్ష్మితో కలిసి ఆమె ఎంపికైన అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా తులసీదేవి మాట్లాడుతూ శిక్షణ కోసం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించామన్నా రు. కర్నూలు జిల్లాకు సంబంధించి 10 మందిని, నంద్యాల జిల్లాలో 10 మందిని ఎంపిక చేశామన్నారు. శిక్షణనిచ్చే అంశాన్ని రెండు జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకుపోతామన్నారు. అనుమతి రాగానే ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాలల్లో శిక్షణ మొదలవుతుందని పేర్కొన్నారు.
ఉల్లి ధర మరింత పతనం
● క్వింటా ధర రూ.93 నుంచి
రూ.459లోపే!
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి ధర మరింత తగ్గింది. క్వింటా ధర రూ.93 నుంచి రూ.459 వరకు మాత్రమే పలికింది. మద్దతు ధరతో ఉల్లి కొనుగోలుకు స్వస్తి పలకడంతో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మద్దతు ధర ఉన్నంత వరకు మార్కెట్‌కు ఉల్లి వెల్లువెత్తింది. ఆగస్టు నెలలోనే 12 వేల క్వింటాళ్లు.. సెప్టెంబర్ నెలలో గరిష్టంగా 18 వేల క్వింటాళ్లు వచ్చింది. ప్రభు త్వం మద్దతు ధరతో ఉల్లి కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్‌కు ఉల్లి రావడం పూర్తిగా తగ్గిపోయింది. సోమవారం 2,445 క్వింటాళ్లు రాగా.. మంగళవారం 1806 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, సజ్జల ధరలు కూడా మరింత పడిపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు
ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో ప్రవేశానికి గడుపు తేదీ ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7వ తేది వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపా రు. ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రవేశ పరీక్ష 7.2.2026న నిర్వహిస్తామన్నారు. సందేహాలుంటే 08512–294545 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
స్వామిత్వ సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన స్వామిత్వ సర్వేను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ కోరారు. మంగళవారం ఆయన సర్వే ఏడీ మునెప్పతో కలిసి పంచాయతీ కార్యదర్శులు, మండల సర్వేయర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి దశలో 74 గ్రామ పంచాయతీల్లో స్వామిత్వ పూర్తయిందని, రెండవ దశలో 85 గ్రామ పంచాయతీల్లో సర్వేలో భాగంగా గ్రౌండ్ ట్రూథింగ్ జరుగుతోందన్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో గ్రౌండ్ ట్రూథింగ్‌లో కొంత జాప్యం ఉందని, ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బి.తాండ్రపాడు, ఆస్పరి, కాల్వ గ్రామాల్లో ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరించి గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తి చేయాలన్నారు. స్వామిత్వ పూర్తయితే గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. సీపీఆర్ ఆదేశాల మేరకు రెండవ దశలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.