
బన్ని ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకుందాం
ఆలూరు రూరల్/చిప్పగిరి: దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రశాతంగా జరుపుకుందామని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. చిప్పగిరి మండల కేంద్రంలోని ఆయన నివాసంలో గురువారం దేవరగట్టు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే చేతుల మీదుగా బన్ని ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హొళగుంద మండలం దేవరగట్టులో వెలసిన మాళమల్లేశ్వర స్వా మి బన్ని ఉత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతున్నాయన్నారు. 27న కంకణధారణ, అక్టోబర్ 2న బన్ని (మాళమల్లేశ్వర స్వామి కల్యాణోత్సం) ఉత్సవాలను కలసికట్టుగా విజయవంతం చేద్దామన్నారు. రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో సంప్రదాయాల చిరునామా దేవరగట్టు ఉత్సవం అన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అధికారులు అన్ని సౌక ర్యాలు కల్పించాలన్నారు. అక్టోబర్ 3న దైవ కార్ణీకం, 4న రథోత్సవం, 5న గొరవయ్యల ఆటలు, కంకణ విసర్జన, 6వ తేదీన మాళమల్లేశ్వర స్వామి విగ్రహ మూర్తులు నెరణికి గ్రామం చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. కార్యక్రమంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలకు చెందిన ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.