
స్థానిక సమస్యలకు ముందుగా పరిష్కారం
ఓర్వకల్లు: ప్రాజెక్టు నిర్మాణంలో సమర్థవంతమైన భూ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు స్థానిక సమస్యలను ముందుగానే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. మండలంలోని గుమ్మితం తండా వద్ద గ్రీన్‌కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టు సైట్‌లోని అప్పర్ రిజర్వాయర్, అప్పర్ ఇన్ టేక్ పాయింట్, ప్రాజెక్టు సైట్ పవర్ హౌస్ తదితర ప్రాంతాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనితీరు, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి, పంపింగ్ ప్రక్రియలను కంపెనీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేస్తున్నప్పుడు టర్బైన్ పనిచేయడాన్ని కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ఎగువ జలాశయానికి వెళ్లి పక్కనే ఉన్న 700 మెగావాట్ల పిన్నాపురం సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిరి మాట్లాడుతూ..ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత, భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడంతో పాటు, పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలని గ్రీన్‌కో అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనితీరులో వినూత్నమైన, స్థిరమైన ఇంజినీరింగ్ పద్ధతులను అవలంబించాలన్నారు. కలెక్టర్ వెంట గ్రీన్‌కో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, ఏపీడీ శ్రీనివాసనాయుడు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.