
ఆశావర్కర్లకు రూ.26 వేల వేతనమివ్వాలి
కర్నూలు(సెంట్రల్) : గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఆరోగ్యసేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం కార్మిక, కర్షక భవన్‌లో ఏపీ ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా ఐదో మహాసభలు ఈశ్వరీబాయ్, రవిజాబీ, వెంకటమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఆశావర్కర్లకు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించడంలో పాలకులు వైవిఫలమయ్యారని విమర్శించారు. నేషనల్ హెల్త్ మిషన్ ఏర్పాటై 20 ఏళ్లు గడిచినా ఆశావర్కర్లను కార్మికులుగా గుర్తించడంలేదని విమర్శించారు. ఆశా వర్కర్లను విచ్చల విడిగా తొలగించడం కూటమి సర్కారు మానుకోవాలని హితవు పలికారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలుగా పి.రమిజాబీ, ప్రధాన కార్యదర్శిగా శివలక్ష్మితోపాటు 33 మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి.నిర్మల, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ పాల్గొన్నారు.