
సంక్షోభంలో ఆప్కో!
● కూటమి ప్రభుత్వంలో మనుగడ కోల్పోతున్న ఆప్కో ● కొత్త చేనేత వస్త్రాలు కొనరు.. షోరూంలకు పంపరు ● పండుగ పూట వెలవెలబోతున్న ఆప్కో షోరూంలు ● ప్రశ్నార్థకంగా మారిన చేనేత వస్త్రాల మార్కెటింగ్ ● అమలుకు నోచుకోని ఉచిత విద్యుత్ హామీ
కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేనేత వస్త్రాల మార్కెటింగ్‌కు అనేక చర్యలు చేపట్టింది. కొత్త షారూములను ఏర్పాటు చేయడంతో పాటు ఆన్‌లైన్ మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించింది. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల వ్యాపారం పెంచేందుకు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చింది. ఉద్యోగులు, ఇతర వర్గాల వారికి ప్రత్యేక స్కీమ్‌లు పెట్టి చేనేత వస్త్రాల వైపు మళ్లించే విధంగా చర్యలు తీసుకుంది.అంతేకాకుండా ప్రతి నెల ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను కొని షోరూములకు పంపడం జరిగేది. దీంతో దసరా నెల రోజుల ముందే కొత్తకొత్త డిజైన్‌తో ఆప్కో షోరూములు కళకళలాడేవి. నేడు ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు కూటమి సర్కారు అలసత్వమే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చేనేత వస్త్రాలు కొనరు.. పంపరు
చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి మంగళగిరిలోని ఆప్కో గోదాములో నిల్వ ఉంచుతుంది. అక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని షోరూములకు సరుకు సరఫరా అవుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేయడం గణనీయంగా తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, శ్రీశైలంలలో ఆప్కో షోరూములు ఉన్నాయి. కొన్ని నెలలుగా వాటికి కొత్త స్టాక్ రాని పరిస్థితి. 2024 జూన్ నుంచి చేనేత సహకార సంఘాల నుంచి అరకొరగా కొనుగోలు చేసిన సరుకు, బకాయిలు కూడా పేరుకుపోయాయి.
ఆప్కో సిబ్బందికి జీతాలు కూడా లేవు
ఆప్కోలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు కూడా లేవు. ఈ ఏడాది జూన్ మాసం వరకు మాత్రమే జీతాలు చెల్లించారు. జూలై నుంచి వేతనాలు లేవు. దసరా పర్వదినాన్ని అక్టోబరు 2న నిర్వహించుకోనున్నారు. పండగ నాటికి కూడ వేతనాలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో సిబ్బంది, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు జరుగుతుండటంతో ఆప్కో ఏమవుతుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వ్యాపారం డీలా
ఎప్పటికప్పుడు వ్యాపారం ఎలా పెంచుకోవాలి.. లాభాలను పెంచుకోవడం ఎలా అనే దానిపైనే దృష్టి ఉండాలి. ఏడాదిన్నర కాలం నుంచి ఆప్కోలో నిస్తేజం నెలకొంది. ఇటు చేనేత జౌళిశాఖ మంత్రి కానీ, ఉన్నతాధికారులు కానీ ఆప్కో వ్యాపార అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు. దీంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1.45 కోట్లకు వ్యాపారం పడిపోగా, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి ఆరు నెలలు రూ. 1.94 కోట్లు వ్యాపారం చేయాల్సి ఉండగా... ఇప్పటి వరకు రూ. 50 లక్షల కూడా దాటలేదంటే ఆప్కో పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో స్పష్టమవుతోంది.ఇదిలా ఉంటే వివిద ప్రభుత్వ శాఖల్లో కింద స్థాయి ఉద్యోగులు,సెక్యూరిటీ సిబ్బంది తదితరులకు యూనిఫామ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఇస్తుంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఎలాంటి బడ్జెట్ ఇవ్వలేదు.
చేనేతకు ఉచిత విద్యుత్ ఏదీ?
కూటమి ప్రభుత్వం మాటల్లో చేనేతపై ఆపారమైన ప్రేమ కనబరుస్తుంది. చేనేతకు 200 యూనిట్లు, పవర్ లూమ్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గత నెలలో జరిగిన చేనేత దినోత్సవంలో ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా చేనేత, జౌళిశాఖ అధికారులు కర్నూలు జిల్లాలో 2,457 చేనేత , ఒక పవర్ లూమ్, నంద్యాల జిల్లాలో 385 చేనేత, 73 పవర్ లూమ్స్‌కు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఏర్పట్లు చేసింది. కాని ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. ఆపరేషన్ గైడ్‌లెన్స్ ఇవ్వకపోవడంతో ఉచిత విద్యుత్ గాల్లోనే ఉండిపోయింది.
చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేసే ఆప్కో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఈ సంస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన ఆప్కో దుకాణాలు నేడు మార్కెటింగ్ లేక వెలవెలబోతున్నాయి. కొన్ని మూత పడే పరిస్థితి ఏర్పడింది.