
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
కర్నూలు కల్చరల్ : దసరా సెలవుల్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌పాల్ తెలిపారు. కొన్ని పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని తెలిపారు. ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు తమ పరిధిలోని ఏవైనా పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వేంపెంటలో
కొండ చిలువ కలకలం
పాములపాడు: మండలంలోని వేంపెంట గ్రా మం ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి కొండచిలువ కనిపించింది. సెవెన్త్ డే చర్చి వెనక సామేలు అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న కొండచిలువను కాలనీ వాసులు గమనించారు. ఫొటోలు,వీడియోలు తీసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా స్పందించంలేదని తెలిపారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే ఏం జరుగుతుందోననే భయంతో బయటకు రాలేకపోతునన్నామని కాలనీవాసులు వాపోతున్నారు.
ఫేక్ ఉద్యోగాలపై
ఎస్పీకి ఫిర్యాదు
కర్నూలు కల్చరల్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో విధుల్లో ఫేక్‌గా నియమితులైన ఉదంతంపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు జిల్లా విద్యాశాఖ తరఫున ఫిర్యాదు చేసినట్లు డీఈఓ శామ్యూల్‌పాల్ తెలిపారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేయనున్నారని పేర్కొన్నారు. ఇందులో ఎంతటివారున్నా చర్యలు తప్పవన్నారు. విద్యాశాఖకు సంబంధించిన వ్యక్తుల ప్రమేయమున్నా వదిలిపెట్టమని డీఈఓ చెప్పారు.
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాలు పడుతున్నందున వ్యవసాయ ఉత్పత్తులను కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోకి ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. ఉదయం 9 గంటల తర్వాత వచ్చిన వాహనాలను మార్కెట్ లోపలికి అనుమతించబోమని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉల్లి గడ్డలను పొలంలోనే గ్రేడింగ్ చేసుకొని మార్కెట్‌కు తీసుకరావాలని సూచించారు. ఎలాంటి మురుగులు లేకుండా తెచ్చిన ఉల్లిగడ్డలకు మంచి ధర లభిస్తుందన్నారు.
పాణ్యం: రెండు రోజులగా కందికాయపల్లె గ్రామస్తులను భయపెడుతున్న చిరుతపులి జాడ కోసం అటవీశాఖ అధికారులు, సోలార్ అధికారులు ముమ్మర గాలింపు చేపట్టారు. గత నెల 25న కూడా పెద్దమ్మ గుడి వద్ద సోలార్‌లో చిరుత సంచరిచిన అనవాళ్లు సీసీపుటేజీలో రికార్డు కావడం, గ్రామంలో రెండు రోజు క్రితం పొలం వద్ద వ్యక్తిని చిరుత వెంబడించింది. దీంతో సమాచారం అందుకున్న అటవీ అధికారులు మంగళవారం డీఆర్‌ఓ విజయలక్ష్మి ఎఫ్‌బీఓ అబ్దుల్‌కలాం గ్రామ సమీపంలోని పొలాలు, కాల్వల వెంట పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు పొలాలకు వెళ్లే సమయంలో ఇద్దరు, ముగ్గురు కలసి వెళ్లాలని సూచించారు.

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు