
కనెక్షన్ల ఏర్పాటులో నిర్లక్ల్యం!
● బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఇద్దరు ఏఈలపై సస్పెన్షన్ వేటు!
నంద్యాల(అర్బన్): రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్యుత్ మెటీరియల్‌కు అవసరమైన డబ్బు చెల్లించినా అదిగో ఇదిగో అంటూ స్థానిక విద్యుత్ కార్యాలయ అధికారులు కాలయాపన చేస్తున్నారు. దీనిపై విసిగిన బాధిత రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు ఏఈలపై వేటు పడినట్లు తెలిసింది.బనగానపల్లె మండలం డోన్ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది.ఈ మండలానికి సంబంధించిన 200 మంది రైతులు విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, కరెంట్ తీగలు తదితర మెటీరియల్ కోసం రూ.60 లక్షలు చెల్లించారు. అయితే, సామగ్రి అందజేతలో బనగానపల్లె విద్యుత్ కార్యాలయ అధికారులు నిబంధనలు పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. మెటీరియల్ కోసం చెల్లించిన సొమ్ముకు సంబంధించిన రికార్డులు సరిగ్గా చూపకపోవడంతో పాటు కొందరికి అరకొరగా మెటీరియల్ పంపిణీ చేయడం, మరికొందరికి మొండిచేయి చూపడం చేశారు. ఈ గోల్‌మాల్‌పై బాధిత రైతులు శాఖ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నంద్యాల జిల్లా ఎస్‌ఈ సుధాకర్‌కుమార్, డోన్ సబ్ డివిజన్ ఈఈ కమలాకర్‌రావు వేర్వేరుగా విచారణ జరిపి నివేదికలను విద్యుత్ సీఎండీ, ఏపీఎస్‌పీడీసీఎల్ ఎండీకి అందజేసినట్లు సమాచారం. దీంతో బనగానపల్లె రూరల్, అర్బన్ ఏఈలు గజ్జప్ప, శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ సోమవారం సీఎండీ కార్యాలయం ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది.అయితే, గుట్టుగా ఈ సస్పెన్షన్ ఎత్తి వేసుకునేందుకు సంబంధిత అధికారులు స్థానిక మంత్రి ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే విద్యుత్ మెటీరియల్ అందించడంలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఉన్నతాధికారులకు ఇచ్చామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుధాకర్‌కుమార్ తెలిపారు.