
ఫుడ్ కంట్రోల్‌లో అధికారుల కొరత
● కార్యాలయానికంతా ఒకే ఒక్కరు విధులు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని సి.క్యాంపులో ఉన్న అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కార్యాలయంలో అధికారుల కొరత వేధిస్తోంది. మొత్తం కార్యాలయాన్ని ఒకే ఒక్కరు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కార్యాలయంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఒక ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనారోగ్యంతో సెలవులో వెళ్లా రు. కార్యాలయ సూపరింటెండెంట్ ఇటీవల బదిలీ అయ్యారు. ఈయన బదిలీ అయిన చోట, కర్నూలు లో మూడు రోజుల పాటు విధులు నిర్వహించాల్సి వస్తోంది. రెండు అటెండర్ పోస్టులు చాలా కాలంగా ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ ఒక్కరే విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఆయనే కార్యాలయం మొత్తం బాధ్యతను నిర్వహిస్తున్నారు. ముగ్గురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తీయాల్సిన శాంపిల్స్‌ను ఈయనే తీయడం, వాటిని ల్యాబోరేటరికి పంపించడం, అనంతరం కోర్టు డ్యూటీలకు హాజరు కావడం, వాటిని కంప్యూటర్‌లో నమోదు చేయడం వంటి పనులన్నీ చేస్తున్నారు. కాగా ఎవ్వరైనా ఫుడ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌లు చేయించుకోవాల్సి వస్తే ఆఫీస్ సూపరింటెండెంట్ ఉండే రోజుల్లో మాత్రమే రావాల్సి ఉంటోంది. ప్రభుత్వం ఇప్పటికై నా అధికారులను నియమించి వ్యాపారుల ఇబ్బందులు తొలగించాల్సిన అవసరం ఉంది.