
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు
● సమస్యలను వెంటనే పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కర్నూలు(సెంట్రల్): ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఆదేశించారు. ఆర్థిక సంబంధం లేని సమస్యల పరిష్కారంలో ఏ మాత్రం జాప్యం చేయకూడదన్నారు. ప్రజలు ఎంతో దూరం నుంచి వస్తారని, వారిచ్చిన అర్జీలకు వెంటనే స్పందించాలన్నారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి జిల్లాలో ఐవీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్ బాగోలేదని, ఇందులో పురోగతి చూపాలన్నారు. సీఎంఓ, డిప్యూటీ సీఎం, విద్యాశాఖమంత్రుల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్య పాల్గొన్నారు.
పోలీసులు అత్యుత్సాహం
పీజీఆర్‌ఎస్‌లో కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపారు. కలెక్టరేట్‌కు చాలా సార్లు వచ్చినా సమస్య పరిష్కారం కావడంలేదని ఎవరైనా అంటే వెంటనే పోలీసులు వచ్చి పక్కకు తీసుకెళ్లారు. ఆలూరు మండలం మొలగవెళ్లికి చెందిన జి.పెద్ద మారెప్ప తన పొలం మధ్యలో కాకుండా రస్తాను మధ్యలో ఉంచాలని అధికారులు కోరాడు. గతంలో రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్లగా తనకు అనూకూలంగా తీర్పు వచ్చిందని, అయినా పొలం మధ్యలోనే రస్తా వెళ్తోందని, పోలీసులను వేడుకున్నా పట్టించుకో లేదన్నారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వృద్ధుడిని పక్కకకు తీసుకెళ్లారు. అలాగే కోడుమూరు మండలం లద్దగిరికి చెందిన వృద్ధురాలు ప్రభావతిని సైతం పక్కకు తీసుకెళ్లారు. కొందరి మాటలు విన్ని తన పొలాన్ని రెవెన్యూ అధికారులు రెడ్‌మార్కులో పెట్టారని, అమ్ముకోవడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలానికి సంబంధించి అడంగల్ పాసు బుక్కు ఉన్నప్పటికీ వేరే వారి అనుమతి ఎందుకు తీసుకుంటారని ప్రశ్నించారు.
ఫిర్యాదుల్లో కొన్ని....
● తన పొలానికి వెళ్లనీయకుండా అక్రమణదారులు వేస్తున్నారని, వారి నుంచి ప్రాణ భయం ఉందని, న్యాయం చేయాలని ఆస్పరి మండలం ములుగుందం గ్రామాని చెందిన అంజినమ్మ అర్జీ ఇచ్చారు.
● తన భర్త విద్యుత్ ప్రమాదంలో మృతి చెందాడని, అత్తింటి వాళ్లు ఇంట్లో ఉండనీయడం లేదని, తన భర్త పేరిట ఉన్న రెండు ఎకరాల పొలాన్ని ఇచ్చి నాకు న్యాయం చేయాలని రోజా అనే మహిళ అర్జీ ఇచ్చారు.
● ఖరీఫ్‌లో నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం రాష్ట్రకార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు