
బస్టాండ్, రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీ
కర్నూలు: ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో పోలీసులు కర్నూలు కొత్తబస్టాండ్, రైల్వేస్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. లోకల్, జీఆర్పీ పోలీసులతో పాటు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు, స్పెషల్ పార్టీ పోలీసులు రైల్వేస్టేషన్‌కు చేరుకుని కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్తున్న రైలులో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అలాగే పార్సిల్ కార్యాలయంలో కూడా అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను పరిశీలించారు. నెలల తరబడి పార్సిల్ డెలి వరీ కాకుండా ఉన్న వస్తువులను నిశితంగా పరిశీలించారు. రైలు బోగీల్లో అనుమానాస్పద వ్యక్తులు, బ్యాగులను పరిశీలించారు. కొందరు వ్యక్తులు ప్రయాణికుల చాటున ఎటువంటి అనుమానం రాకుండా రైళ్లలో డ్రగ్స్, గంజాయి వంటి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, ఎక్కడైనా అలాంటి వారు తారసపడితే టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నాలుగో పట్టణ సీఐ విక్రమ సింహా ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.