
రూ.20 వేలు వద్దు... మద్దతు ధరనే కావాలి!
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం రూ.1200 మద్దతు ధరతో ఉల్లి కొనుగోళ్లకు స్వస్తి పలికి ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రకటించడం పట్ల ఉల్లి రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మాకు ఎకరాకు రూ.20 వేలు వద్దే వద్దు.. మద్దతు ధరతోనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ రైతుల నుంచి దాదాపు 70 వేల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. దాదాపు 10 వేల మంది రైతులకు మద్దతు ధర ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన రైతులకు మాత్రం ఎకరాకు రూ.20 వేలు మాత్రమే చెల్లిస్తామనడం పట్ల రైతులు మండిపడుతున్నారు. ఈ–క్రాప్ ప్రకారం ఇప్పటివరకు 50 వేల ఎకరాల్లో ఉల్లి సాగయింది. ఈ–క్రాప్ ఇంకా కొనసాగుతుండటంతో విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి వ్యయం వస్తోంది. అయితే అధిక వర్షాలు ఉల్లి రైతులను దెబ్బతీశాయి. ప్రతి రైతు ఎకరా సాగులో కనీసం 20 క్వింటాళ్ల వరకు పారబోశారు. ఉల్లి క్వింటాకు లభిస్తున్న సగటు ధర రూ.500 మాత్రమే. 40 శాతం మంది రైతులకు రూ.100, రూ.200, రూ.300 ధర లభిస్తుండటం గమనార్హం. దీంతో రైతులు మద్దతు ధరతోనే ఉల్లి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.20 వేలు చెల్లించడం జరిగేనా!
గతంలో మిర్చి పంటను క్వింటాలుకు రూ.11700 ప్రకారం కొంటామని ప్రకటించింది. ఒక్క రైతుకు కూడ ఈ ప్రకారం ధర చెల్లించిన దాఖలాలు లేవు. పొగాకు రైతుకు న్యాయం చేస్తామని, మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. జిల్లాలో ఒక్క రైతు నుంచి కూడ పొగాకు కొనుగోలు చేయలేదు. ఇపుడు ఉల్లి సాగుకు సంబందించి ఎకరాకు రూ.20 వేలు చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. దీనిని రైతులు విశ్వసించడం లేదు.
ఒక్కసారిగా తగ్గిన ఉల్లి తాకిడి
ఉల్లికి మద్దతు ధర లేదని ప్రకటించడంతో ఒక్కసారిగా మార్కెట్‌కు ఉల్లి తాకిడి తగ్గడం గమనార్హం. ఈ నెల 21న మార్కెట్‌కు సెలవు. మొన్నటి వరకు రోజుకు 14 వేల క్వింటాళ్ల వరకు వచ్చింది. గరిష్టంగా రూ.18500 క్వింటాళ్లు కూడా వచ్చింది. అయితే సోమవారం 2445 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఈ పరిస్థితిని చూస్తే కమీషన్ ఏజెంట్లే మార్కెట్‌కు తెచ్చిన ఉల్లిని నామమాత్రపు ధరతో కొని దానిని బయటికి తరలించి అదే ఉల్లిని మళ్లీ లోపలికి తెచ్చారనే విషయం స్పష్టమవుతోంది.
ఈ ఖరీఫ్‌లో 2 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. ఎకరాకు రూలక్షకు పైనే పెట్టుబడి పెట్టాం. గత నెల 15న 92 క్వింటాళ్ల ఉల్లి అమ్ముకున్నాం. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బ్యాంకు ఖాతాకు జమ కాలేదు. తాజాగా 38 క్వింటాళ్లు తెచ్చాం. క్వింటాకు రూ.240 ధర లభించింది. ఈ ధరతో అమ్ముకుంటే రూ.9120 వస్తుంది. ఎకరాకు రూ.20 వేలు ఇచ్చినా.. వస్తున్న మొత్తం రూ.30 వేల వరకే. నష్టం ఊహించడానికే భయమేస్తోంది. ఉల్లిని ప్రభుత్వం మద్దతు ధరతోనే కొనుగోలు చేయాలి.
– శ్రీరాములు, ఎర్రకోట, ఎమ్మిగనూరు మండలం
ఉల్లి సాగు పెరిగిందంట!
టీడీపీ నేతల మాయాజాలం
ఎకరాకు రూ.20 వేలు పరిహారం
ప్రకటించిన తర్వాత
పెరుగుతున్న సాగు విస్తీర్ణం
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ నేతల మాయాజాలంతో జిల్లాలో ఉల్లి సాగు విస్తీర్ణం అమాంతం పెరిగిపోతోంది. ఎకరాకు రూ.20వేలు పరిహారం చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంతో ఈ–క్రాప్‌లో ఉల్లి సాగు శరవేగంగా పెరిగిపోతుండటం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం నాటికి 44,468 ఎకరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేశారు. ఆదివారం సెలవు అయినందున పంటల నమోదుకు వెళ్లిన దాఖలాలు లేవు. అయితే సోమవారం సాయంత్రానికి 50,300 ఎకరాల్లో ఉల్లిసాగు అయినట్లు నమోదు చేశారు. మరో రెండు రోజుల్లో 60 వేల ఎకరాలకు వెల్లినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంకా ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రక్రియ పూర్తయ్యేలోపు ఉల్లి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. గ్రామస్థాయి టీడీపీ నేతలు, కార్యకర్తలు, టీడీపీ మద్దతుదారులు రైతుసేవా కేంద్రాల ఇన్‌చార్జీలతో అడ్డుగోలుగా నమోదు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ–క్రాప్ నమోదుపై జిల్లా యంత్రాంగంలో అనుమానాలు రావడంతో రెవెన్యూ అధికారుల ద్వారా ర్యాండమ్‌గా తనిఖీలు చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.

రూ.20 వేలు వద్దు... మద్దతు ధరనే కావాలి!