
అమ్మకు కుమారుడి లాలి!
పుట్టిన కుమారుడిని అమ్మ లాలిస్తుంది.. మురిపెంగా అన్నం తినిపిస్తుంది.. దాహం వేస్తే నీళ్లు తాపిస్తుంది.. చక్కగా నెత్తి దువ్వి ఎవరి దిష్టి తగలకుండా తిలకం దిద్దుతుంది.. పలకాబలపం ఇచ్చి స్కూల్‌కు పంపిస్తుంది. అయితే ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో అమ్మకే కుమారుడు లాలి పాట పాడుతున్నాడు. ఇందుకోసం పాఠశాలకు వెళ్లడం మానుకున్నాడు. అన్నం వండి పెడుతూ ఆకలి తీరుస్తున్నాడు. అమ్మను చిన్నారి అనుకుని మోస్తూ ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. కూలీ పనులు చేసి వచ్చిన డబ్బుతో మాత్రలు కొనుగోలు చేసి మింగిస్తున్నాడు. అమ్మ బాగా నడవాలని దేవున్ని వేడుకుంటున్నాడు.
ఏం జరిగిందంటే..
దైవందిన్నె గ్రామానికి చెందిన సంకటి నాగరాజు, సంకటి ఎల్లమ్మకు పెళ్లయిన 12 సంవత్సరాలకు సంకటి ప్రసన్నరాజు జన్మించాడు. లేకలేకపుట్టిన కుమారుడిని వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ తల్లిదండ్రులు స్కూల్‌కు పంపేవారు. అయితే ఆరు సంవత్సరాల క్రితం సంకటి ఎల్లమ్మకు పక్షపాతం రావటంతో మంచానికి పరిమితమైంది. వివిధ పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉన్న నాగరాజు అనారోగ్యంతో కొన్ని నెలల క్రితం మృతి చెందాడు. దీంతో బాలుడు ప్రసన్నరాజు స్కూల్‌కు వెళ్లడం మానుకున్నాడు. తల్లికి అన్నీ తానై సేవలు చేస్తున్నాడు. కూలీ పనులకు వెళ్తూ వచ్చిన డబ్బులతో తల్లికి మందులు తెస్తున్నాడు. తాను ఒక్కొక్క రోజు పస్తులు కూడా ఉంటున్నట్లు బాలుడు కన్నీతో చెప్పాడు. తన తల్లికి పింఛన్ వస్తే మందుల ఖర్చులకు డబ్బులు వస్తాయని కుమారుడు రాజు అంటున్నాడు. తన తల్లీతో పాటు తాను కూడా పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోవాలని చాలా సార్లు అనుకున్నానని, అయితే కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నానని, తన తల్లికి పింఛన్ ఇవ్వాలని కోరాడు.
– ఎమ్మిగనూరురూరల్