
బన్ని ఉత్సవాల్లో రక్తపాతానికి తావివ్వొద్దు
కర్నూలు(సెంట్రల్): అక్టోబర్ 2న దేవరగట్టు బన్ని ఉత్సవాలను రక్తపాతానికి తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో దేవరగట్టు బన్ని ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు, దేవస్థాన కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే సుమారు 2 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపం తలెత్తరాదన్నారు. ఉత్సవాల పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా దేవరగట్టుకు చేరుకునే అన్ని రోడ్ల మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు. అడ్డాన్స్‌డ్ లైఫ్ సపోర్టు కలిగిన 4 అంబులెన్స్‌లు, 20 పడకల తాత్కాలిక ఆసుపత్రిని సిద్ధం చేయాలన్నారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్ మాట్లాడుతూ అవసరమైన ప్రదేశాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇరుకు రోడ్డును విస్తరించాలన్నారు. పోలీసు, అబ్కారీ శాఖ సమన్వయంతో నాటు సారా, మద్యం అమ్మకాలు, సరఫరా నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. సీసీ కెమెరాలతో పాటు 10 డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచనున్నట్లు చెప్పారు. అనంతరం శ్రీమాళా సహిత మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను కమిటీ సభ్యులతో కలసి కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శాంతికళ, ఆర్‌డీఓ భరత్‌నాయక్, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకరరెడ్డి, డీపీఓ భాస్కర్ పాల్గొన్నారు.