
వైద్యులకు సామాజిక దృక్పథం అవసరం
● కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ
కర్నూలు(హాస్పిటల్): వైద్యులకు సామాజిక దృక్పథం అవసరమని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ అన్నారు. కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ.. వైద్య విద్య పూర్తి చేయాలంటే విద్యార్థులకు దృఢ సంకల్పంతో పాటు అంకితభావం ముఖ్యమన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితే సులభంగా వైద్యవిద్యను పూర్తి చేయవచ్చని తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజీకి ఎంతో గొప్ప పేరుందని, ఆ కీర్తిని నిలపాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థికీ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వైద్యవిద్యలో ప్రతిరోజూ విలువైనదేనని, అది పూర్తయ్యే వరకు రోజువారి ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ సాయిసుధీర్, డాక్టర్ హరిచరణ్, డాక్టర్ రేణుకాదేవి, డాక్టర్ విజయానందబాబు, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ కో ఆర్డినేటర్ డాక్టర్ సింధియా శుభప్రద, స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్‌కే ప్రకాష్, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.