
చెలిమిల్లలో పిచ్చికుక్కల స్వైర విహారం
● 8 మందిపై దాడి ● భయాందోళనలో గ్రామస్తులు
పాములపాడు: చెలిమిల్ల గ్రామంలో సోమవారం రెండు పిచ్చి కుక్కలు రోడ్లపై కనిపించిన వారిపై దాడికి పాల్పడ్డాయి. గ్రామానికి చెందిన రమేష్, సుబ్బమ్మ, అయ్యమ్మ, చిన్న లక్ష్మయ్య, అబ్రహాం, అనసూయబాయి, శివారెడ్డి, డియోనాథ్‌ను కరిచాయి. గాయాలపాలైన వారు వెంటనే ఆత్మకూరు, పాములపాడు ప్రభుత్వ వైద్యశాలలకు పరుగులు తీశారు. జనంపై దాడి చేసిన ఓ పిచ్చి కుక్కను గ్రామస్తులు మట్టుబెట్టి జేసీబీతో గొయ్యి తీసి పూడ్చి వేశారు. నాగపుల్లయ్య అనే రైతుకు చెందిన మేక, చెన్నమ్మకు చెందిన రెండు మేకలపై పిచ్చి కుక్కలు దాడి చేసి గాయ పరిచాయి. అలాగే మరో 5 వీధి కుక్కలను కూడా కరిచాయి. ఏ కుక్కను చూసినా ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. ప్రతి గ్రామంలో కుక్కల సంతతి విపరీతంగా పెరగడంతో వాటి స్వైర విహారం ఎక్కువైంది. ఎక్కడ చూసినా గుంపులుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో పిల్లలు వీధుల్లో ఆడుకునేందుకు వెళ్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏ కుక్క ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని గ్రామాల్లో వీధి కుక్కలను పట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.