
అఫ్లియేషన్.. అంతా మాయ!
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిఽధిలో బీఈడీ కళాశాలల అఫ్లియేషన్ అంతా గందరగోళంగా మారింది. వర్సిటీ అఽధికారులతో కొన్ని కళాశాలల యాజమాన్యాల లోపాయకారి ఒప్పందం, అఫ్లియేషన్ కమిటీలతో లాబీయింగ్, రాజ్‌విహార్ కూడలిలోని ఒక ప్రముఖ హోటల్‌లో కమిటీ సభ్యులు, యాజమాన్యాల రహస్య సమావేశం, అమ్యామ్యాల అప్పగింతలు వెరసి బీఈడీ కళాశాలలకు అఫ్లియేషన్ ప్రక్రియను ముగించేశారు. ఇందులో కొన్ని కళాశాలల పేర్లు పేపర్లలో మాత్రం అద్భుతంగా దర్శనమిస్తాయి. పేపర్లలో పొందుపరిచిన అడ్రస్‌లకు వెళితే మాత్రం ఫిజికల్‌గా అక్కడేమీ ఉండదు. ఆర్‌యూ పరిఽఽధిలో 2025–26 విద్యా సంవత్సరానికి 47 బీఈడీ కళాశాలలకు అఫ్లియేషన్ ఇచ్చారు. ఇందులో సుమారు 10 కళాశాలలు మాత్రం పేపర్లలో కనిపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కళాశాలలకు సొంత భవనాలు లేవు. ఎన్‌సీటీఈ క్లియరెన్స్ లేకుండానే ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌లో డోన్‌కు చెందిన ఒక కళాశాలకు అవకాశం ఇచ్చారు. బీఎడ్ కళాశాల ఏర్పాటుకు ఎన్‌సీటీఈ నుంచి ఏ అడ్రస్‌తో అయితే అప్రూవల్ తీసుకుంటామో అదే అడ్రస్‌లో కళాశాలల నిర్వహణ ఉండాలి. అడ్రస్ ఒక చోట, కళాశాల మరోచోట ఉంటోంది. అఫ్లియేషన్ కమిటీ వచ్చినప్పుడు తూతూ మంత్రంగా ఏదో ఒక బిల్డింగ్ (మల్టీపర్పస్ బిల్డింగ్ – బీఈడీ కళాశాలలకు సంబంధం లేనివి)ను చూపించి మమ అనిపించేస్తున్నారు. ఎన్‌సీటీఈ, న్యాయస్థానం, అఫ్లియేషన్ కమిటీల నివేదికల ప్రకారమే అఫ్లియేషన్ ఇచ్చినట్లు వర్సిటీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ పూర్తి కాకుండానే ఇతర రాష్ట్రాల విద్యార్థులతో అడ్మిషన్లు చేసుకోవడం గమనార్హం. ఎన్‌సీటీఈ అనుమతి లేకుండానే విచ్చలవిడిగా ఉర్దూ అడ్మిషన్లు చేసుకుంటుండటం విస్తుగొలుపుతోంది. వీటిపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి సమగ్ర విచారణ చేయిస్తే అఫ్లియేషన్ బండారం బయట పడుతుందని మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు.
ఎన్‌ఓసీ తంటా..
ఆర్‌యూ నుంచి తప్పుకొని వేరే యూనివర్సిటీకి వెళ్లి పోతామని సుమారు 10 కళాశాలల యాజమాన్యాలు వర్సిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ)లు తీసుకున్నారు. ఇందులో కొన్ని కళాశాలలకు సైతం అఫ్లియేషన్ ఇచ్చారు. వాటిల్లో విద్యార్థులు చేరుతున్నారు. ఎన్‌వోసీలు తీసుకున్న కళాశాలల యాజమాన్యాలు అఫ్లియేషన్‌కు ఫీజు కట్ట కూడదు. ఒక వేళ కళాశాలలు లైవ్‌లో ఉండేందుకు ఫీజు కట్టినా యూనివర్సిటీ అధికారులు సంబంధిత కళాశాలలకు అఫ్లియేషన్ కమిటీలను పంప కూడదు. పంపినా మేము ఎన్‌వోసీ తీసుకున్నాం, జీరో ఇయర్‌గా పాటిస్తున్నామని యాజమాన్యాలు లెటర్ ఇవ్వాలి. వర్సిటీ అధికారులు ఎలాంటి లెటర్‌లు తీసుకోకుండా అఫ్లియేషన్ ఇచ్చి కౌన్సెలింగ్‌కు అనుమతించారు. దీంతో విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం కళాశాల షిఫ్టింగ్ కాకపోయినా వచ్చే విద్యా సంవత్సరం కళాశాల వేరే వర్సిటీ పరిధిలోకి షిఫ్ట్ అయితే పరిస్థితి ఏంటో వర్సిటీ అధికారులకే తెలియాలి. ఎన్‌వోసీతో ఇప్పటికే వేరు వర్సిటీల పరిధిలోకి వెళ్లిపోయిన బీఈడీ కళాశాలల్లో చదివిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిస్థితి, కరస్పాండెన్స్ ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
బీఈడీ కళాశాలలు ఎక్కడున్నాయి, బిల్డింగ్‌లు, వసతులు ఉన్నాయా లేదా అనే విషయాలను అఫ్లియేషన్ కమిటీలు ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లినప్పుడు పరిశీలిస్తాయి. ఆ కమిటీల నివేదికల ఆధారంగానే బీఈడీ కళాశాలలకు వర్సిటీ అఫ్లియేషన్ ఇచ్చాం. కమిటీల రిపోర్ట్‌ను కాదని ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు. బీఈడీ కళాశాలలకు ఎన్‌వోసీ ఇచ్చినా ఎన్‌సీటీఈ నుంచి షిఫ్టింగ్ క్లియరెన్స్ వచ్చే వరకు ఆ కళాశాలలు మా పరిధిలోనే ఉంటాయి. విద్యా సంవత్సరం మధ్యలో ఎలాంటి షిఫ్టింగ్ చేయకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. – డాక్టర్ విజయ కుమార్ నాయుడు,
రిజిస్ట్రార్, ఆర్‌యూ
కమిటీలదే ప్రధాన పాత్ర..
వర్సిటీ పరిధిలోని కళాశాలలకు అఫ్లియేషన్ ఇవ్వడానికి అఫ్లియేషన్ కమిటీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ కమిటీలు కళాశాలలను ఫిజికల్‌గా సందర్శించి ఎన్‌సీటీఈ నిబంధనలను పరిశీలించి సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి వాస్తవ పరిస్థితి ఏంటో నివేదిక ఇవ్వాలి. ఈ నివేదిక ఆధారంగా మాత్రమే వర్సిటీ సీడీసీ విభాగం, వర్సిటీ ఉన్నతాధికారులు అఫ్లియేషన్ ఇస్తారు. అయితే యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్న కమిటీలను ఏర్పాటు చేయించుకొని కళాశాలలను తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేసుకుని వ్యవహారం నడిపించారు. కమిటీ సభ్యులు ఎన్‌సీటీఈ నిబంధనలను కమిటీ సభ్యులు పరిశీలిస్తే సుమారు 15 కళాశాలలకు అఫ్లియేషన్ ఇచ్చే పరిస్థితి ఉండదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయించి..
ఎన్‌సీటీఈ వసతులు సరిగా లేని కళాశాలకు పీఏఆర్ నోటీసు, విత్‌డ్రా నోటీసులు ఇచ్చింది. పబ్లిక్ హియరింగ్‌లో పీఏఆర్, విత్‌డ్రా నోటీసులు ఉన్న కళాశాలలకు వర్సిటీ అఫ్లియేషన్ కమిటీలు విజిట్ చేయ లేదు. దీంతో సంబంధిత యాజమాన్యాలు న్యాయ స్థానాలను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు వర్సిటీ అధికారుల ఆయా కళాశాాలలకు అఫ్లియేషన్ కమిటీలను ఇన్‌స్పెక్షన్‌కు పంపాయి. కమిటీ సభ్యులు వాస్తవ పరిస్థితిని నివేదికలో పొందుపరిస్తే అఫ్లియేషన్ ఇచ్చే పరిస్థితి ఉండదు. న్యాయ స్థానానికి ఎన్‌సీటీఈకి సైతం ఈ నివేదికను సమర్పించవచ్చు. ఇక్కడి దాకా పరిస్థితి రాదు. కానీ కమిటీలు తూతూ మంత్రంగా విజిట్ చేసి ఏవో కొన్ని రిమార్కులు పెట్టాయి. ఈ నివేదిక ప్రకారం కండిషనల్ అఫ్లియేషన్ ఇచ్చినట్లు తెలిసింది.
ఆర్‌యూ బీఎడ్ కళాశాలల
అఫ్లియేషన్‌లో గందరగోళం
ఎన్‌ఓసీలు తీసుకున్న
బీఎడ్ కళాశాలకు వర్సిటీ గుర్తింపు
సొంత భవనాలు లేని కళాశాలలకు
అఫ్లియేషన్
ఎన్‌సీటీఈ క్లియరెన్స్ లేకుండానే
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌లో ఒక కళాశాల
బీఈడీ కాలేజీలు ఉండేది ఒక చోట..
అడ్రస్ మరో చోట
అనుమతి లేకుండానే
విచ్చలవిడిగా ఉర్దూ అడ్మిషన్లు
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ పూర్తి కాకుండానే
ఇతర రాష్ట్రాల విద్యార్థులతో అడ్మిషన్లు