
ఆలయాల్లో పటిష్ట భద్రత
మహానంది: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఆక్టోపస్ డీఎస్పీ జగ్గినాయుడు తెలిపారు. మహానందిలో ఆలయ భద్రతపై ఆదివారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో సీసీ కెమెరాల నిఘా తప్పనిసరి అన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆలయాలు, భక్తుల భద్రతలో పోలీసులతో పాటు రెవెన్యూ, ఫైర్, ఇతర శాఖల అధికారుల పాత్ర ఉందన్నారు. రాత్రి 9.00 గంటల నుంచి మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలు, భక్తులు, స్థానికులకు అవగాహన కల్పించారు.
తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు
ఆళ్లగడ్డ: చదువుకోవటం ఇష్టంలేక ఇంటి నుంచి పారిపోయిన బాలుడు ఏడాది తరువాత ఆళ్లగడ్డ పట్టణ పోలీసుల సహకారంతో ఆదివారం తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంట గ్రామానికి చెందిన కుందూరు బ్రహ్మనందరెడ్డి కొడుకు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. చదువుపై ఇష్టము లేకపోవడంతో పాఠశాలకు సక్రమంగా పోయేవాడు కాదు. తల్లిదండ్రుల తరుచు పాఠశాలకు వెళ్లాలని మందలిస్తుండటంతో గతేడాది ఇంటి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి కుమారుడి కోసం తల్లిదండ్రులు ఎంత గాలించినా ఆచూకి లభ్యం కాలేదు. అయితే గత రెండు రోజుల క్రితం ఓ సెల్‌ఫోన్ నుంచి తండ్రి బ్రహానందరెడ్డి మొబైల్‌కు ఫోన్ చేసి తనకు ఇంటికి రావాలని ఉందని చెప్పి పోన్ కట్‌చేశాడు. వెంటనే వారు పట్టణ పోలీసులను ఆశ్రయించగా ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాతీయగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిందని తెలిసింది. దీంతో వెంటనే పట్టణ పోలీసులు అప్రమత్తమై పోలీస్ సిబ్బందిని పంపి బాలుడిని గుర్తించి ఆదివారం తల్లిదండ్రులకు అప్పగించారు.

ఆలయాల్లో పటిష్ట భద్రత