
హత మార్చి.. మృతదేహాన్ని చెరువులో పూడ్చి!
ప్యాపిలి/పత్తికొండ రూరల్: పత్తికొండ మండలం చక్రాళ్ల గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డి (37) ని హత్య చేసి మృతదేహాన్ని ప్యాపిలి మండలం వెంగళాంపల్లి చెరువులో పూడ్చిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. పత్తికొండ సీఐ జయన్న, తహసీల్దార్ హుసేన్‌సాబ్, ప్యాపిలి ఎస్‌ఐ మధుసూదన్, అసిస్టెంట్ ఫోరెనిక్స్ అధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. హత్యకేసు నిందితులను అరెస్టు చేశారు. పత్తికొండ పోలీసు స్టేషన్‌లో సీఐ తెలిపిన వివరాల మేరకు.. గత మే నెలలో పద్మనాభ రెడ్డిని లంకాయపల్లి రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, జానకి, తిలక్‌వర్మారెడ్డి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు కిరాయి హంతకులు గంప అయ్యన్న, రాజేశ్, ఎద్దులదొడ్డి శ్రీరాములు, ప్రసాద్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం కిరాయిహంతకులు పద్మనాభరెడ్డిని గత మే నెలలో హత్య చేసి వెంగళాంపల్లి చెరువులో పూడ్చి పెట్టారు. విషయం తెలియని పద్మనాభరెడ్డి భార్య శిరీష తన భర్త కనిపించడం లేదని అప్పట్లో పత్తికొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులను విచారించగా తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు వారు పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని చూపించగా పోలీసులు పద్మనాభరెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. పూడ్చి పెట్టి నాలుగు నెలలు కావడంతో మృతదేహం పూర్తిగా అస్తిపంజరంగా మారింది.