
దేవరగట్టులో 2న బన్ని ఉత్సవం
హొళగుంద: దేవరగట్టులో దసరా బన్ని ఉత్సవం వచ్చే నెల 2న నిర్వహించనున్నారని, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరధ్వాజ్ ఆదేశించారు. దేవరగట్టులో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామపెద్దలతో శనివారం ఆయన మాట్లాడారు. తేరు బజారు, కొత్తపేట రోడ్డు, డొళ్లిన బండె తదితర ప్రదేశాలను పరిశీలించారు.
ముగ్గురు ఎంపీడీఓలకు పోస్టింగ్స్
కర్నూలు(అర్బన్): ఇటీవల ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన ఆరుగురిలో ముగ్గురికి పోస్టింగ్స్ ఇచ్చినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డ్వామాలో ఏఓగా విధులు నిర్వహిస్తున్న టీ క్రిష్ణమోహన్ శర్మను గూడురు, పాములపాడు ఏఓ ఎం గాయత్రీని బండి ఆత్మకూరు ఎంపీడీఓగా, మహానంది డిప్యూటీ ఎంపీడీఓగా ఉన్న పీ నాగేంద్రుడును ఆత్మకూరుకు పోస్టింగ్ ఇచ్చామన్నారు. పదోన్నతి పొందిన వారిలో పీ దస్తగిరిబాబు, ఎస్ నాగరాజు, రామక్రిష్ణవేణికి ఇంకా పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో కోసిగి, ఓర్వకల్లు, నంద్యాల జిల్లాలో అవుకు, కొలిమిగుండ్ల, బనగానపల్లెలో ఎంపీడీఓ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాగా, పోస్టింగ్స్ కోసం ఎదురు చూస్తున్న ముగ్గురిని కూడా పీఆర్ కమిషనరేట్ నంద్యాల జిల్లాకే కేటాయించింది.
శక్తి యాప్‌పై విస్తృత ప్రచారం
కర్నూలు: మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి యాప్, శక్తి వాట్సప్ నంబర్లపై కళాశాలలు, పాఠశాలల్లో పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో శక్తి టీమ్ బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు శక్తి యాప్‌ను జిల్లాలో 16,722 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరింత మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే విధంగా శక్తి టీమ్ బృందాలు మహిళలు, బాలికలకు పాఠశాలలు, కళాశాలల్లో సదస్సు నిర్వహించి అవగాహన కల్పించారు. శక్తి యాప్‌తో పాటు సైబర్ నేరాలు, డ్రగ్స్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టాలు, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
వాల్మీకి జయంతిని కర్నూలులో నిర్వహించాలి
కర్నూలు(అర్బన్): వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించాలని వాల్మీకి సంఘం నేతలు కోరారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో వాల్మీకి నేతలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జయంతిని జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు, ఏపీ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు మురళీనాయుడు, రామకృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రామాంజనేయులు, జేఏసీ కన్వీనర్ కృష్ణ, నాయకులు కుబేరస్వామి, వెంకటేష్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగ కమిటీలో ఇద్దరికి చోటు
కర్నూలు (టౌన్): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో ఇద్దరికి నియమించారు. వీరు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వారు. రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా ఎం. పెద్దన్న, రాష్ట్ర వైఎస్సార్‌టీయుసీ అధికార ప్రతినిధిగా కేవీ రమణారెడ్డిలను నియమిస్తూ శనివారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

దేవరగట్టులో 2న బన్ని ఉత్సవం

దేవరగట్టులో 2న బన్ని ఉత్సవం