
అనకొండ అవినీతిపై నత్తనడకన విచారణ
● తవ్వేకొద్ది వెలుగు చూస్తున్న అక్రమాలు ● సిబ్బంది ప్రమేయంతోనే భారీగా నిధుల స్వాహా ● స్కామ్‌లో తెరపైకి పలువురి ఉద్యోగుల పేర్లు ● చర్యలు తీసుకోవడంలో అధికారుల జాప్యం
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్‌లో ప్రభుత్వ నిధులు స్వాహా కేసులో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో స్థానిక డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో పని చేసి రిటైర్డ్ అయిన కార్యాలయ పర్యవేక్షణాధికారి చాంద్‌బాషా ప్రధాన నిందితుడిగా తేల్చి అరెస్ట్ చేశారు. అక్రమాలు మొదట రూ.4 కోట్లుగా నిర్ధారణ చేసి విచారణ చేపట్టగా మరో రూ. 3 కోట్ల మేర బయటపడినట్లు సమాచారం. ఈ కేసులో జరిగిన లావాదేవిలను అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్‌వో శివప్రసాద్ బృందం విచారణ చేస్తుండగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు చాంద్‌బాషా అటవీశాఖలో పని చేస్తున్న పలువురు మినిమం టైం స్కేల్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కొందరు ఏబీవోలు, ఎఫ్‌బీవోల సహకారాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిధుల స్వాహాలో పలువురి ఉద్యోగుల పేర్లు తెరపైకి వచ్చినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అక్రమార్కుడికి సహకరించిన కొందరు ఉద్యోగులు దర్జాగా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం.
విచారణలో వెలుగులోకి వచ్చిన
అంశాలు..
● డీడీ కార్యాలయంలో కంప్యూటర్ విభాగంలో పని చేసే ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రెండు బ్యాంకు అకౌంట్లలోకి ప్రధాన నిందితుడు వేతనాల పేర్లతో మూడు సార్లు నిధులు మళ్లించుకున్నట్లు బ్యాంకు స్టేట్‌మెంట్లు తెలుపుతున్నాయి. ఈ లెక్కన ఆయన నెలకు మూడు వేతనాల చొప్పున డ్రా చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.ఈ దారి మళ్లిన సొమ్ము ప్రధా న నిందితునికి చేరిందా లేకా అన్ని అంశాలలో సహకరించిన ఉద్యోగికి అనకొండ అందించిన నజరానా అనే సంగతి తెలియాల్సి ఉంది.
● మినిమం టైం స్కేల్ ఉద్యోగి ఒకరు తన పరిధిలో ఉన్న వన సంరక్షణ సమితికి కేటాయించిన సొమ్మును నేరుగా చెక్కుల రూపంలో ప్రధాన నిందితుడి సోదరుడి ఖాతాకు మళ్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి.
● ఒక ఏబీవో, ఏబీవోలకు కూడా డీడీ కార్యాలయ బ్యాంకు అకౌంట్ నుంచి పెద్ద మొత్తం బదిలీ చేసి, తిరిగి ఆ మొత్తం అనకొండ సంబంధీకుల ఖాతాలకు జమ చేసినట్లు సమాచారం.
● ఆత్మకూరు డివిజన్‌లో ఉన్న ఒక ఎఫ్‌ఆర్‌ఓ జీపు డ్రైవర్‌గా పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఖాతాలోకి ఆయన వేతనం కాకుండా పలుమార్లు పెద్ద మొత్తాలు బదిలీ అయినట్టు వెలుగు చూసింది. ఆ మొత్తం తిరిగి ఫోన్‌పే ద్వారా ఈ కేసులో ప్రధాన నిందితుడి సూచనల మేరకు ఇతర అకౌంట్లకు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు.
● బైర్లూటీ ఎకో – టూరిజం రిసార్ట్‌లో పనిచేసే ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఖాతాలకు కూడా వనసంరక్షణ సమితిల నుంచి చెక్కుల రూపంలో పెద్ద మొత్తం జమ అయినట్లు విచారణలో తెలిసినట్లు సమాచారం.
● అటవీ నిధుల స్వాహాలో తెరపైకి పలువురి ఉద్యోగుల పేర్లు వెలుగులోకి వస్తున్నా విచారణ నత్తనడకన కొనసాగుతుండటం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.