
సమస్యలు పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్‌ను కోరిన
ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి
ఆలూరు/కర్నూలు(సెంట్రల్): ఆలూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరిని ఎమ్మెల్యే బి.విరూపాక్షి కోరారు. శనివారం ఆయన కలెక్టర్‌ను ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హొళగుంద నుంచి ఢణాపురం వరకు ఉన్న రహదారి బాగు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఈ రోడ్డును బాగు చేయించాలన్నారు. ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిని కమ్మరచేడు గ్రామంలో ఏర్పాటు చేశారని, అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఒక్కసారి ఆసుపత్రిని పరిశీలించి సమస్యలను స్వయంగా కళ్లారా చూడాలని ఆయన ఆమెకు సూచించారు. హొళగుంద ఎస్సీ హాస్టల్‌ను రీ ఓపెన్ చేయాలని, హాస్టల్ సదుపాయం లేకపోవడంతో ఎంతో మంది పేద విద్యార్థులు పనులకు వెళ్లి బాల కార్మికులుగా మారిపోతున్నట్లు చెప్పారు. ఆలూరు నుంచి పెద్దహోతూరు వరకు ఉన్న రహదారిలో పడిన గుంతలను పూడ్చాలని, నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని వారణకు చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. ఎమ్మెల్యే వెంట దేవనకొండ జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు తదితరులు ఉన్నారు.