
జిల్లాలో చెరువులన్నింటినీ నింపండి
కర్నూలు (సెంట్రల్): జిల్లాలోని చెరువులన్నింటినీ నీటితో నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఆమె కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, నీటి లభ్యత, ఆయకట్టు, పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, చెల్లించాల్సిన మొత్తాలపై ఆరా తీశారు. ముఖ్యంగా అవార్డు అయిన భూములకు ఎంత పరిహారం చెల్లించాలన్న దానిపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇంజినీరింగ్ అధికారుల సమన్వయంతో తనకు ఒక నివేదికను సమర్పించాలని ఆదేశించారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కింద ఎన్ని చెరువులకు నీటిని నింపుతున్నారని ఆరా తీయగా 40 చెరువులను నింపామని అధికారులు వివరణ ఇచ్చారు. భూగర్భ జలాలను పెంచడానికి అన్ని చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌ఈ పాండురంగయ్య, ఎస్‌డీసీలు అనురాధ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.