
కేఎంసీ అలుమ్ని భవనం కోసం స్థల పరిశీలన
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజి అలుమ్ని (పూర్వ విద్యార్థుల సంఘం) భవనం నిర్మాణం కోసం శనివారం స్థల పరిశీలన చేశారు. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ చంద్రశేఖర్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, అలుమ్ని సంఘం నాయకులు కలిసి కళాశాలలోని పలు స్థలాలను చూశారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ అలుమ్ని వైద్యులు ఈ కళాశాల విద్యార్థులే అని, ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఇక్కడి వైద్యులకే తిరిగి ఉపయోగపడతాయని చెప్పారు. అయితే ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలా నిర్మాణ ప్రదేశం ఉండాలని అలుమ్ని సంఘం నాయకులకు సూచించారు. ఈ మేరకు కళాశాలలో చివరగా ఉన్న ఎగ్జామినేషన్ హాలు పక్కనున్న ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అలుమ్ని ప్రెసిడెంట్ డాక్టర్ బి.కుమారస్వామిరెడ్డి, డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ అలుమ్ని భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రెండేళ్ల క్రితమే జీవో విడుదలైందని, ఈ భవన నిర్మాణం అన్నది వైద్యులందరి కోసం అని, ముఖ్యంగా కళాశాల వైద్యులకు మరింత ఉపయోగపడుతుందని చెప్పారు. అందరి సమ్మతితో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మైదానానికి దూరంగా ఉన్న ప్రదేశాన్నే సూచిస్తున్నామని తెలిపారు. ఈ స్థల పరిశీలనలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిసుధీర్, ప్రొఫెసర్ డాక్టర్ మాధవీశ్యామల, అలుమ్ని నాయకులు డాక్టర్ రామచంద్రరావు, వైద్యులు పాల్గొన్నారు.