
కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్
కర్నూలు(సెంట్రల్) : విద్యుత్ రంగ కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ అంజిబాబు, బీమేష్, గౌరవాధ్యక్షుడు పి.నాగరాజు డిమాడ్ చేశారు. శనివారం విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకముందు సీఐటీయూ కార్యాలయం నుంచి విద్యుత్ భవన్‌కు కార్మికులు ర్యాలీగా వెళ్లారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అంతేగాక అధిక వేతనాలను అమలు చేస్తామని చెప్పినా పట్టించుకోవడంలేదన్నారు. కనీస వేతనం రూ.46 వేలు ఇవ్వాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే పోరాటాలకు దిగుతామని చెప్పారు. 5వ తేదీలోపు సమస్యలను పరిష్కరించకపోతే తిరుపతిలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే విజయవాడలోని విద్యుత్ సౌధాను ముట్టడిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.