
ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోండి
పత్తికొండ: పట్టణంలో కోర్టు విస్తరణకు గతంలో కేటాయించిన స్థలంలో ఆక్రమణలు ఉంటే నోటీసులు ఇచ్చి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి రెవెన్యూ అధికారులకు సూచించారు. గురువారం పత్తికొండ పట్టణంలోని డిగ్రీ కళాశాల పక్కన మన్రోతోపులో గతంలో కోర్టు ప్రాంగణం విస్తరణకు కేటాయించిన స్థలాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలావెంకటశేషాద్రి, పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి జ్యోష్ణాదేవితో కలసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక జూనియర్ సివిల్ జడ్జి ప్రాంగణంలో ఆర్‌డీఓ భరత్‌నాయక్, తహసీల్దార్ హుశేన్‌సాహెబ్‌లతో సమావేశం నిర్వహించారు. రాబోవు రోజుల్లో కోర్టు పరిధి పెరిగే అవకాశం ఉన్నందున కేటాయించిన స్థలంలో ఆక్రమణలను నోటీసులు ఇచ్చి యుద్ధప్రాతిపదికన తొలగించాలన్నారు. భవిష్యత్‌లోనూ ఆక్రమణలకు తావులేకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. పత్తికొండ పర్యటనకు వచ్చిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలావెంకటశేషాద్రి స్థానిక సబ్‌జైల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.