
అగ్రిగోల్డ్ భూముల సర్వే అడ్డగింత
కృష్ణగిరి: మా తాతల కాలం నుంచి భూములను మేము అనుభవిస్తున్నాం, కానీ ఇప్పుడు వచ్చి మీ భూములను అగ్రిగోల్డ్ సంస్థకు అమ్మారని సర్వే చేస్తామంటే ఒప్పుకోమని తొగర్చేడు గ్రామానికి చెందిన రైతులు కొండయ్య, గిడ్డయ్య, మద్దిలేటి, నాగేశ్వరమ్మ, పెద్ద ఎల్లయ్య తదితరులు అధికారులకు తెగేసి చెప్పారు. మంగళవారం సీఐడీ, రెవెన్యూ అధికారులు అగ్రిగోల్డ్ సంస్థ కొనుగోలు చేసిన పొలాలు సర్వే చేసేందుకు రైతులకు నోటీసులు ఇచ్చి వెళ్లారు. భూముల మీదకు సర్వేకు వచ్చిన సీఐడీ సీఐ గిరిబాబు, ఎస్‌ఐ రంగయ్య, తహసీల్దార్ ప్రకాష్‌బాబును రైతులు అడ్డుకొని తమ గోడు వినిపించారు. ఈ పొలాలే ఆధారమై జీవిస్తున్న తమకు ఆన్యాయం చేస్తే కుటుంబాలతో రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఽధికారులు మాట్లాడుతూ కృష్ణగిరి మండల పరిధిలో తొగర్చేడు, రామకృష్ణాపురం, కృష్ణగిరి గ్రామాల పరిధిలో 2011లో 440 ఎకరాలు అగ్రిగోల్డ్ సంస్థ కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయన్నారు. అయితే, ఈ సంస్థ ఆస్తులను గుర్తించి వాటి ద్వారా వచ్చే మొత్తాన్ని బాధితులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అయితే, భూముల మీదకు వెళ్లినప్పుడు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుఉకవస్తే రికార్డుల ఆధారంగా పరిష్కరిస్తామన్నారు. అలాగే ఈ భూముల్లో కొంత వరకూ అక్రమాలు జరిగినట్లు గతంలోనే గుర్తించామన్నారు. మీ స్వాధీనంలో ఉండే భూములను మీరు కాకుండా వేరే వ్యక్తులు అమ్మినట్లు ఆధారాలు తీసుకవస్తే న్యాయం చేస్తామని తెలిపారు.