
ఐదెకరాల వక్ఫ్ భూమి అన్యాక్రాంతం
కర్నూలు(అర్బన్): కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలోని 301, 319, 320, 325, 324, 326 సర్వే నెంబర్లలోని వక్ఫ్‌బోర్డు భూములు అన్యాక్రాంతమైనట్లు తమ దృష్టికి వచ్చిందని జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్స్‌పెక్టర్ ముక్తార్‌బాషా తెలిపారు. మంగళవారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి ఎస్.సబీహా పర్వీన్, ఇతర మైనారిటీ అధికారులతో కలిసి ఈ భూములను పరిశీలించామన్నారు. ఆయా సర్వే నెంబర్లలో దాదాపు 42 ఎకరాలు వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన భూములు ఉన్నాయన్నారు. ఇందులో దాదాపు ఐదు ఎకరాలు పూర్తి స్థాయిలో అన్యాక్రాంతమయ్యాయని.. పలు కట్టడాలు, సాగు చేస్తున్న భూములు ఉన్నాయన్నారు. అన్యాక్రాంతమైన ఈ ఐదు ఎకరాల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఈ భూములకు రిజిస్ట్రేషన్స్ ఎలా జరిగాయనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అక్రమ రిజిస్ట్రేషన్స్‌ను రద్దు చేయించేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే మరో 14 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూములకు సంబంధించి గ్రామంలోని ప్రజలకు తహసీల్దార్ పట్టాలు ఇచ్చారని, ఈ పట్టాల విషయంపైనా తహసీల్దార్‌ను నివేదిక కోరతామన్నారు. పంచలింగాల గ్రామంలోని వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను తమ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని ముక్తార్‌బాషా తెలిపారు.