
గల్లీల్లో స్కూళ్లు.. గాల్లో ప్రాణాలు!
చర్యలు తీసుకుంటాం
కర్నూలు సిటీ: జిల్లాలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కర్నూలు నగరంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లలో, అపార్ట్‌మెంట్లలో, చిన్ని సందుల్లో ప్రైవేట్ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. వీటిలో విద్యార్థుల భద్రత కరువైంది. ఇందుకు కీర్తి హైస్కూల్‌లో జరిగిన ఘటననే నిదర్శనంగా చెప్పవచ్చు. ఆ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంది.
నిబంధనలకు పాతర!
కొన్ని ప్రైవేటు స్కూళ్లలో టాయిలెట్లు సరిగ్గా లేవని, తాగేందుకు మంచి నీరు కూడా లేదనే విమర్శలు ఉన్నాయి. వెలుతురు, గాలి రాని చిన్నపాటి తరగతి గదులు ఉంటున్నాయి. విద్యాశాఖ అధికారులు స్కూళ్లకు అనుమతులు ఇచ్చే, రెన్యూవల్స్ చేసే సమయంలో తనిఖీలు చేయాల్సి ఉంది. అయితే నిబంధనలను పాతరేసి అనుమతులు ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలకు ఆటలు నేర్పించేందుకు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు ఆట స్థలాలు లేవు. కనీసం వెయ్యి పుస్తకాలతో లైబ్రరీ కూడా నిర్వహించడం లేదు. భవనం పది మీటర్ల ఎత్తు దాటితే ఫైర్ సర్టిఫికెట్, సౌండ్ నెస్, బిల్డింగ్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ట్రాఫిక్ క్లియరెన్స్ సర్టిఫికేట్ సైతం ఉండాలి. ఇవన్నీ కాగితాల్లోనే ఉంటున్నాయి.
విద్యాశాఖ నిర్లక్ష్యం!
కర్నూలు పాతబస్తీలోని కవాడివీధికి చెందిన ఖాజా బాషా, వజీదా దంపతుల కుమారుడు రాఖీబ్ మృతికి విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం..స్కూల్ యాజమాన్య అలసత్వమే కారణమని తెలుస్తోంది. కీర్తి హైస్కూల్‌లో సరైన వసతులు లేకపోయినా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయకుండానే అనుమతులకు రెన్యూవల్ చేశారు. స్కూల్ యాజమాన్యం చేసిన అలసత్వమే విద్యార్థి మృతికి కారణమని ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
కీర్తి హైస్కూల్‌లో జరిగిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందారు. దీంతో స్కూల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాం. మంగళవారం కరస్పాండెంట్‌పై క్రిమినల్ కేసులు పెట్టనున్నాం. అదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన ఎక్కడ జరుగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు కర్నూలు నగరంలోని పాతబస్తీలోని అన్ని స్కూళ్లను తనిఖీ చేస్తాం. నిబంధనలు అతిక్రమించిన స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఎస్. శామ్యూల్ పాల్, డీఈఓ
ప్రైవేట్ స్కూళ్లలో
నిబంధనలకు పాతర
తరగతి గదుల్లో వెలుతురు కరువు
గాలి రాక అవస్థల్లో విద్యార్థులు
తనిఖీలు చేయని విద్యాశాఖ
అధికారులు