
పాముకాటుతో యువ రైతు మృతి
ఆలూరు రూరల్: పాము కాటుతో యువ రైతు రవి మృతిచెందాడు. ఈ విషాద ఘటన ఆలూరు మండలం అరికెర గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రవి (32) గ్రామ సమీపంలో రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. సోమవారం పొలంలో కూలీలు తీసిన పత్తి దిగుబడులను ట్రాక్టర్‌లో వేస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం ట్రాక్టర్‌లో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. రవికి భార్య లత ( ప్రస్తుతం 9 నెలల గర్భవతి), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబీకులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.
పరామర్శించిన ఎమ్మెల్యే విరూపాక్షి
పాముకాటుతో రవి మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.