
గిట్టుబాటు ధర లేకనే రైతు ఆత్మహత్య
● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే
కంగాటి శ్రీదేవి
వెల్దుర్తి: పండించిన ఉల్లికి గిట్టుబాటు ధర లేకనే రైతు కురువ రామచంద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి అన్నారు. రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందన్నారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక వెల్దుర్తి మండలం కొసనాపల్లె గ్రామ రైతు కురువ రామచంద్రుడు ఆత్మహత్య చేసుకోగా కర్నూలు పెద్దాసుపత్రికి వెళ్లి మృతదేహానికి నివాళి అర్పించారు. అనంతరం మృతుని భార్య శివలక్ష్మీ దేవి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని పంటలు పండించిన రైతులను రాష్ట్రప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. రైతుల మనోధైర్యాన్ని మరింత దిగజారుస్తోందన్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని, రైతులెవరూ మనో ధైర్యాన్ని కోల్పోవద్దని వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. యూరియా దొరకక, ఉల్లి, టమాటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి చూసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.