చివరి నిమిషంలో వస్తుండటంతో.. | - | Sakshi
Sakshi News home page

చివరి నిమిషంలో వస్తుండటంతో..

Sep 14 2025 3:25 AM | Updated on Sep 14 2025 3:25 AM

చివరి

చివరి నిమిషంలో వస్తుండటంతో..

ఎక్కువ శాతం ప్రైవేటు నుంచి వచ్చేవారే!

ఈ ఏడాది పెద్దాసుపత్రిలో

మృతుల సంఖ్య

ప్రాణం నిలబడుతుందని చాలా మంది వంద కిలోమీటర్ల నుంచి పెద్దాసుపత్రికి వస్తుంటారు. కొందరు రోగులు ఆసుపత్రికి వచ్చీ రాగానే మృతి చెందుతున్నారు. మరికొందరు చికిత్స పొందుతూ కోలుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల నుంచి చివరి నిమిషంలో వచ్చిన వారు అకస్మాత్తుగా మృతి చెంది కుటుంబ సభ్యులకు కన్నీళ్లను మిగులుస్తున్నారు. పెద్దాసుపత్రిలో ప్రతి నెలా 500కు పైగా మృతులు రికార్డు అవుతున్నాయి. అధికా రుల పర్యవేక్షణ లేకపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లా నుంచే గాక నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్‌ కడప, రాయచోటి, ప్రకాశం, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలు చికిత్స కోసం వస్తారు. ప్రతిరోజూ 2,500 నుంచి 3,000 మంది దాకా ఓపీ రోగులు, 1,300 నుంచి 1,500 మంది ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్సల విభాగాలకు చికిత్స కోసం చాలా మంది రోగులు వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం క్యాజువాలిటీకి ప్రతిరోజూ 500 నుంచి 800 దాకా వస్తున్నారు.

ప్రతి ఏటా 6 వేల మృతులు

పెద్దాసుపత్రిలో డాక్టర్లు ఎలాగైనా ప్రాణాలు రక్షిస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ఆత్మహత్య కోసం యత్నించిన వారు ఎక్కువ మంది వస్తుంటారు. వివిధ రకాల్లో ప్రమాదాల్లో గాయపడిన వారు, గుండెపోటుతో అస్వస్థతకు గురైన వారు, పక్షవాతంతో చేయి, కాలు పడిపోయిన వారు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారు ఇక్కడికి వస్తుంటారు. క్యాజువాలిటీకి ఎక్కువగా అత్యవసర వైద్యం కోసం వస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో ప్రతిరోజూ 6 నుంచి 8 మంది క్యాజువాలిటీలోనే మృతి చెందుతున్నారు. ఇక్కడ ప్రథమ చికిత్స అందుకుని ఏఎంసీకి వెళ్లినా 20 నుంచి 30 శాతం మాత్రమే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతున్నారు. ప్రతిరోజూ ఈ విభాగంలో 10 నుంచి 12 మంది వరకు మృతి చెందుతున్నారు. చిన్నపిల్లల విభాగం, గైనకాలజీ, కార్డియాలజీ విభాగాల్లో కొందరు కోలుకోలేక ప్రాణాలు వదులుతున్నారు. ప్రతి నెలా 550కి పైగా, ఏడాదికి 6వేల దాకా కర్నూలు పెద్దాసుపత్రిలో మృతి చెందుతున్నారు.

ఏసీలు ఆగిపోయి.. ఇన్‌పెక్షన్‌ పెరిగి

ఆసుపత్రిలోని క్యాజువాలిటీలో సీఎంఓలతో పాటు డ్యూటీ డాక్టర్లుగా జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌ విభాగాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమిస్తారు. వీరు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు ఉదయం 8 గంటల వరకు విధుల్లో ఉండాల్సి ఉంటుంది. వీరికి సహాయకులుగా ఆయా విభాగాల పీజీలు, హౌస్‌సర్జన్లు ఉంటారు. కానీ చాలా మంది డ్యూటీ డాక్టర్లు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జూనియర్‌ వైద్యులకు దగ్గరుండి సూచనలు, సలహాలు ఇచ్చే వారు లేకపోవడంతో వారు అత్యవసరమైతే సంబంధిత డ్యూటీ డాక్టర్‌కు ఫోన్‌ చేస్తున్నారు. వివరాలు తెలుసుకుని వైద్యం అందిస్తున్నారు. ఈ కొద్ది సమయంలోనే సకాలంలో వైద్యం అందక రోగులు మృతి చెందుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏఎంసీలో కూడా వైద్యులకు షిఫ్టుల వారీగా 24 గంటల డ్యూటీ ఉంటుంది. ఇక్కడ 32 పడకలు ఉండగా 25కు పైగా వెంటిలేటర్లు ఉన్నాయి. రోగికి అమర్చిన మానిటర్లు, వెంటిలేటర్లు సైతం చూడలేని కొందరు వైద్యసిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డ్యూటీ డాక్టర్లు అక్కడే ఉండకుండా కేవలం రౌండ్స్‌ వేసి వెళ్తున్నారు. దీంతో జూనియర్‌ వైద్యులపై భారం పడుతోంది. వైద్యపరికరాలు సరిగ్గా పనిచేయకపోవడం, నిర్వహణ లేక ఏసీలు ఆగిపోవడం, ఉక్కపోత, గాలి రాకపోవడం, ఇన్‌ఫెక్షన్‌ రేటు పెరిగిపోవడంతోనే మృతులు సంఖ్య పెరుగుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాజువాలిటీ, ఏఎంసీల్లో ఎవరు పనిచేస్తున్నారన్న పర్యవేక్షణ లేదని విమర్శలు ఉన్నాయి.

ప్రైవేట్‌ ఆసుపత్రిలో డబ్బులు వెచ్చించలేక చివరి నిమిషంలో రోగులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. చికిత్స అందించినా కోలుకోలేక మృతి చెందుతున్నారు. ఆసుపత్రిలో నిర్వహించే ప్రతి సమావేశంలో వైద్యులకు సూచనలు, సలహాలు చేస్తున్నాం. రోగులకు వైద్యం అందించడంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నాం. నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తీసుకుంటాం.

–డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు,

సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, కర్నూలు

నెల మృతుల సంఖ్య

జనవరి 539

ఫిబ్రవరి 552

మార్చి 466

ఏప్రిల్‌ 544

మే 561

జూన్‌ 547

జులై 582

ఆగస్టు 591

ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే సరిగ్గా పట్టించుకోరన్న వాదన చాలా మందిలో ఉంది. ఎవరైనా తెలిసిన వారుంటేనే, ఎవ్వరితోనైనా సిఫారసు చేయిస్తే బాగా చూసుకుంటారన్న అపనమ్మకం రోగులు, వారి సహాయకుల్లో నెలకొంది. దీంతో ఆసుపత్రిలో చేరిన వారిలో చాలా మంది వారికి తెలిసిన వారికి ఫోన్‌ చేసి అధికారులు, వైద్యులకు సిఫార్సు చేయిస్తుంటారు. మరికొందరు రోగులు ముందుగా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఉన్న డబ్బులు అయిపోయాక చివరి నిమిషంలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. ఈ క్రమంలో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో రోగి ప్రాణాలు దక్కడం లేదు. కొందరు ఆసుపత్రికి వస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందుతుండగా, మరికొందరు ఆసుపత్రికి వచ్చాక చికిత్స పొందుతూ కొద్దిసేపటికే కన్నుమూస్తున్నారు.

ప్రతి నెలా పెద్దాసుపత్రిలో కోలుకోలేక

500 మందికి పైగా మృతి

అత్యవసర విభాగం,

ఏఎంసీలో మృతుల సంఖ్య అధికం

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న

వైద్యసిబ్బంది

అధికారులు పర్యవేక్షించడం లేదని

ఆరోపణలు

చివరి నిమిషంలో వస్తుండటంతో.. 1
1/2

చివరి నిమిషంలో వస్తుండటంతో..

చివరి నిమిషంలో వస్తుండటంతో.. 2
2/2

చివరి నిమిషంలో వస్తుండటంతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement