● బాధ్యతలు చేపట్టిన
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు(సెంట్రల్): ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. కలెక్టరేట్‌లో కలియ తిరిగి ఏ శాఖ కార్యాలయాలు ఎక్కడున్నాయో తెలుసుకున్న తరువాత శనివారం తన కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.కబర్ధిని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించారు. అలాగే రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి టీజీ భరత్‌ను ఆయన నివాసంలో కలసి తిరిగి కలెక్టరెట్‌కు చేరుకున్నారు. ఇక్కడ జిల్లా అధికారులతో పరిచయం చేసుకున్నారు. కొత్త కలెక్టర్‌కు ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పలువురు జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకంక్షలు తెలిపారు.
భూగర్భ జలాల పెంపుపై దృష్టి
అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భూగర్భ జలాల పెంపు అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేయాలన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్య శాలలలో మరమ్మతులు చేయాలని, భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోర్టు కేసులు, ఆర్టీఐ అంశాల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌గా పనిచేసి రిలీవ్ అయి క్యాంపు ఆఫీసులో ఉన్న పూర్వపు కలెక్టర్ పి.రంజిత్‌బాషాను కూడా కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిశారు.