
జీడీపీ మూడు గేట్ల ఎత్తివేత
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్ (జీడీపీ) మూడు గేట్లను ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని శనివారం హంద్రీనదిలోకి విడుదల చేశారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జీడీపీకి భారీస్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం రెండు గేట్లను ఎత్తి తొలుత 2 వేల క్యూసెక్కులు తర్వాత 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం జీడీపీలో నీటి నిల్వ 4.1 టీఎంసీలకు చేరుకోవడంతో మరో గేటు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయంలో 3.8 టీఎంసీల నీటిని నిలువ ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జీడీపీ అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు గూడూరు, ఓర్వకల్, వెల్దుర్తి మినహా అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా చిప్పగిరిలో 45.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోనెగండ్లలో 35.8, ఆదోనిలో 33.4, కోసిగిలో 20.6, కోడుమూరులో 16.4, నందవరంలో 15.6, హొళగుందలో 15.4, పెద్దకడుబూరులో 10.6, కౌతాలంలో 10.2 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 10.3 మిమీ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 116.5 మిమీ ఉండగా.. ఇప్పటి వరకు 90.7 మి.మీ వర్షం కురిసింది. అధిక వర్షాల వల్ల ఉల్లికి భారీగా నష్టం జరుగుతోంది. రాబోయే 48 గంటల్లో కూడా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం 1100 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
● 66 కృష్ణజింకలు, 6 చుక్కల
దుప్పులను వదలిన అధికారులు
ఆత్మకూరురూరల్: ఎన్‌ఎస్‌టీఆర్‌లో మాంసాహార జంతువులు, గడ్డిమేసే జంతువుల నిష్పత్తిలో తేడాను సవరించడంలో భాగంగా ఆత్మకూరు డివిజన్ అటవీ అధికారులు శనివారం నల్లమలలో మొత్తం 72 జింకలను వదలారు. 66 కృష్ణ జింకలు, 6 చుక్కల దుప్పులను సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి తరలించి ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని రుద్రకోడు సెక్షన్‌లో వదిలారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో వీటిని వదిలారు. స్థానిక వాతావరణానికి అలవాటు పడిన తరువాత వీటిని ఎన్ క్లోజర్ నుంచి బయటకు విడిచి పెడతారు. ఇప్పటికే నల్లమలలోని బైర్లూటి రేంజ్‌లో, నంద్యాల అటవీ డివిజన్ లోని పచ్చర్ల బీట్‌లో దుప్పులను, జింకలను వదిలారు. వీటిని నాగార్జునా ఫెర్టిలైజర్స్ కంపెనీ గ్రీన్ ఏరియాలో నుంచి తీసుకొచ్చారు.