
ఆంధ్రాతిలక్..గాడిచెర్ల
వందేమాతర ఉద్యమంలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నంద్యాల నుంచి మొదటి ఎమ్మెల్యే
రాత్రి బడులు ఏర్పాటు చేసిన ఘనత గాడిచెర్లదే
ప్రజలను ఆకట్టుకున్న గాడిచెర్ల గ్రంథాలు, రచనలు
నిరుద్యోగ యువతకు ఆదర్శం
నేడు గాడిచెర్ల 142వ జయంతి
కోవెలకుంట్ల: తెల్లదొరల కబంధ హస్తాల నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు పోరాటం చేసిన ఎందరో మహానుభావుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఒకరు. వందేమాతరం ఉద్యమంలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడిగా, గ్రంథాలయాల అభివృద్ధికి విశిష్ట సేవలందించి గ్రంథాలయ పితామహుడిగా పేరు ప్రఖ్యాతలు గడించారు. ఆంధ్రాతిలక్‌గా జిల్లా ఖ్యాతిని దేశ నలుమూలలా చాటారు. పేద కుటుంబంలో జన్మించిన గాడిచెర్ల అంచెలంచెలుగా ఎదిగి స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించటమే కాకుండా ఎన్నో రచనలు రచించారు. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నంద్యాల నుంచి ఎన్నికై న మొట్టమొదటి ఎమ్మెల్యేగా చరిత్రకెక్కారు.
ఆంధ్రా తిలక్‌గా..
వందేమాతర ఉద్యమంలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడిగా గాడిచెర్ల రంగప్రవేశం చేసి అంకుఠిత దీక్షతో ఉద్యమించాడు. సాహిత్యం, వయోజన విద్య, గ్రంథాలయోధ్యమం, పత్రికా రచన, సంఘసంస్కరణ, సంఘీభావ ప్రకటనలు, సభలు, సమావేశాలతో గాడిచెర్ల జీవితం ముందుకు సాగింది. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్‌వారు బాలగంగాధర తిలక్‌ను అరెస్ట్ చేసిన రోజునే గాడిచెర్లను అరెస్టు చేసి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో గాడిచెర్ల ఆంధ్ర తిలక్‌గా పిలువబడ్డాడు. జైలులో గాడిచెర్లను బ్రిటీష్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టింది. జైలులో ఉంటూనే అనేక గ్రంథాలు రచించాడు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ మరోవైపు రచనలు, ఆకాశవాణి ప్రసంగాలు, సభలు, సమావేశాలు, సాంఘిక సంస్కరణలు, గ్రంథాలయాల ఏర్పాటు, గ్రంథాలను సమకూర్చడం, పత్రికలు నడపడం వంటి పనుల్లో తలమునకలై ఉండేవాడు. హోంరూల్ ఉద్యమంలో గాడిచెర్ల కీలకపాత్ర పోషించడమే కాకుండా చిత్తరంజన్‌దాస్, మోతీలాల్ నెహ్రూ స్థాపించిన స్వరాజ్య పార్టీని ఆంధ్రలో అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ప్రాంతాలతో ఉన్న నంద్యాల స్థానం నుంచి 1928వ సంవత్సరంలో పోటీచేసి మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే మద్రాసు కౌన్సిల్ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు.
ముఖ్య పట్టణాల్లో గాడిచెర్ల విగ్రహాలు
స్వాతంత్య్ర ఉద్యమంలో ఒకవైపు పాలు పంచుకుంటూ మరో వైపు గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తూ గ్రంథాలయ పితామహుడయ్యారు. ప్రజల కోసం ఎన్నో గ్రంథాలు, రచనలు రచించి ప్రపంచ విజ్ఞానాన్ని గ్రంథాలయాల ద్వారా పాఠకుల ముందుంచారు. అప్పటి గ్రంథాలయాలు దినదినాభివృద్ధి చెందుతూ విజ్ఞాన భాండాగారాలుగా నిలిచాయి. గ్రంథాలయాల అభివృద్ధి కోసం పాటుపడిన గాడిచెర్ల నిరుద్యోగ యువతకు ఆదర్శప్రాయుడయ్యా రు. రాయలసీమ జిల్లాలోని కర్నూలు, వైఎస్సార్ జిల్లా గ్రంథాలయ సంస్థల ఆవరణాల్లో, కోవెలకుంట్లలో నంద్యాల మాజీ ఎంపీ ప్రోచాబ్రహ్మానందరెడ్డి సహకారంతో గాడిచెర్ల విగ్రహాలు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా వెలుగోడు గ్రంథాలయ ఆవరణలో రెండున్నరేళ్ల క్రితం గాడిచెర్ల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఆదివారం గాడిచెర్ల 142వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వయోజన విద్యకు ప్రోత్సాహం
కర్నూలుకు చెందిన భాగీరథీబాయి, వెంకటరావు దంపతులకు 1883 సెప్టెంబర్ 14వ తేదీన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు జన్మించారు. ఈయన విద్యాభ్యాసమంతా కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తిలో సాగింది. పేద కుటుంబం కావడంతో ఇంటి పనులు చేసి మరీ పాఠశాలకు వెళ్లి చదువుకునేవాడు. చిన్నతనం నుంచి గాడిచెర్ల చదువుతోపాటు ఆటపాటల్లో ప్రావీణ్యం పొందాడు. సూక్ష్మగ్రాహి, ఏకసంధ్యాగ్రహి కావడంతో ఎటువంటి పద్యాలు, పాఠ్యాంశాలను అవలీలగా అప్పచెప్పేతత్వం అలవర్చుకున్నాడు. గాడిచెర్ల చేతిరాత అద్భుతంగా ఉండేది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో కళ్లు చెదిరేలా రాసేవాడు. ఇతని దస్తూరిని గుర్తించి యూనివర్సిటీ బంగారు పతకం బహూకరించింది. 1907వ సంవత్సరంలో ఎంఏ పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణకు గాడిచెర్ల రాజమండ్రిలో ట్రైనింగ్ కళాశాలకు వెళ్లాడు. ఉదయం కళాశాలకు వెళుతూ రాత్రివేళల్లో నిరక్షరాస్య వయోజనులకోసం రాత్రి బడులు ఏర్పాటు చేసిన ఘనత గాడిచెర్లదే. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్‌చంద్రపాల్‌ను స్ఫూర్తిగా తీసుకోవడంతో గాడిచెర్లలో అంతర్గతంగా దాగి ఉన్న స్వాతంత్య్ర పిపాస, దేశభక్తి ఒక్కసారిగా పెల్లుబికాయి.

ఆంధ్రాతిలక్..గాడిచెర్ల