
రోడ్డు మూసేసి.. సమస్యను తెరచి!
యూటర్న్ ఏర్పాటుతో ఇరువైపులా ట్రాఫిక్ పద్మవ్యూహం
కేసీ కెనాల్ వినాయక్‌ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన యూటర్న్
నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఏ వాహనం ఎటువైపు నుంచి వస్తుందో, ఎక్కడ బ్రేక్ పడుతుందో, వెనుక నుంచి ఏ ప్రమాదం వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి. ప్రజలు నిత్య నిరకాన్ని చూస్తున్న పరిస్థితుల్లో టీడీపీ నేతలు సరికొత్త ట్రాఫిక్ సమస్యకు తెరతీశారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఏకంగా రోడ్డునే మూసేశారు. ఈ కారణంగా నగర నడిబొడ్డున అత్యంత రద్దీ ప్రాంతమైన కేసీ కెనాల్ వినాయక్‌ఘాట్ వద్ద ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. గాయత్రీ ఎస్టేట్‌కు ఎదురుగా టీడీపీ జిల్లా కార్యాలయం ఉంది. సరిగా ఈ కార్యాలయానికి ఎదురుగానే నారాయణ పాఠశాల నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ కావడంతో ఇక అడ్డేముంది అనుకున్నారు. కార్యాలయం వద్ద, పాఠశాల వద్ద రద్దీ తగ్గించుకునేందుకు ఏకంగా ఓ దారికి పోలీసు బారికేడ్లను అడ్డు వేయించారు. ఇదే సమయంలో కేసీ కెనాల్ వినాయకఘాట్ వద్ద యూటర్న్ ఏర్పాటు చేశారు. సమీపంలోనే ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. మందుబాబులు ఏ పరిస్థితుల్లో వస్తున్నారో కూడా తెలియకుండా రోడ్డు దాటుతుండటం.. నాలుగైదు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నీ ఇక్కడే కలుస్తుండటంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభిస్తోంది. ఈ విషయాన్ని ‘సాక్షి’ దృశ్యరూపకంగా ప్రచురించడంతో పోలీసులు స్పందించారు. అక్కడ ఏర్పాటు చేసిన యూటర్న్‌ను శుక్రవారం ఉదయం సరిచేసేందుకు యత్నించారు. ఇంతలో టీడీపీ ముఖ్యనేత నుంచి ఫోన్ రావడంతో సరిచేసిన యూటర్న్‌ను యథావిధిగా తెరిచి అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ప్రజలు ఏమైనా పర్వాలేదు, మేము బాగుంటే చాలనుకునే ధోరణి టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటి వరకు సాఫీగా సాగుతున్న ట్రాఫిక్‌ను, స్వార్థానికి రోడ్డు మూసివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు

రోడ్డు మూసేసి.. సమస్యను తెరచి!

రోడ్డు మూసేసి.. సమస్యను తెరచి!