
ప్రజల అర్జీలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను జేసీ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవా రం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లాగిన్‌లో పరిష్కారం అయిన వాటిని ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలన్నారు. సీఎంఓ గ్రీవెన్స్‌లకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ దగ్గర 11, కర్నూలు ఆర్‌డీ ఓ దగ్గర 8, పత్తికొండ ఆర్‌డీఓ దగ్గర 4, కలెక్టరేట్ ఏఓ దగ్గర 3, సర్వే ఏడీ, విద్యాశాఖ, డీఆర్‌డీఏ పీడీ, ఏపీఐఐసీ జెడ్‌ఎంల దగ్గర ఒక్కో అర్జీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీఆర్వోసి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● కర్నూలు మండలం పంచలింగాల సమీపాన ఉన్న స్కంద వెంచర్‌లో పార్కు కోసం కేటాయించిన 2 ఎకరాల స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని అవాజ్ నగర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పి.ఇక్బాల్ హుస్సేన్, ఎస్‌ఎండీ షరీఫ్ జేసీ డాక్టర్ బి.నవ్యకు వినతిపత్రం ఇచ్చారు.
● తమకు ప్రత్యేకంగా రేషన్ కార్డు ఇవ్వాలని హిజ్రాలు అర్జీలు ఇచ్చారు.
● ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలుగా పనిచేస్తున్న వారికి మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని అర్జీ ఇచ్చారు.