
డిప్లమా కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
కర్నూలు(హాస్పిటల్): స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ డిప్లమా కోర్సుల దరఖాస్తు గడువు పొడిగించినట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 27వ తేది సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు భర్తీ చేసిన దరఖాస్తులను కార్యాలయ పనిదినాల్లో కర్నూలు మెడికల్ కాలేజి కార్యాలయంలో రూ.100 రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు. పోస్టు ద్వారా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవన్నారు. దరఖాస్తులు aprahpc.co.in వెబ్‌సైట్‌లో లభిస్తాయన్నారు. అక్టోబర్ 10వ తేదిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఈ కోర్సులకు ఇంటర్, తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్ బైపీసీ చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, తర్వాత మిగిలిన గ్రూపులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
వైద్యం వికటించి గర్భిణి మృతి
ఎమ్మిగనూరు రూరల్: స్థానిక ప్రైవేట్ నర్సింగ్‌హోంలో వైద్యం వికటించి గర్భిణి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం సుగూరు గ్రామానికి చెందిన పార్వతి పెద్దపెండేకల్‌కు చెందిన నరసింహులకు ఇచ్చి కొన్ని సంవత్సరాల క్రితం వివాహాం జరిపించారు. రెండో కాన్పుకు పార్వతి పుట్టినిల్లు సూగురుకు వచ్చింది. బుధవారం సాయంత్రం నొప్పులు రావటంతో ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోంకు తీసుకొచ్చారు. రాత్రి నర్సింగ్ హోంలో అడ్మిట్ చేసుకొని గురువారం ఉదయం డెలివరి చేస్తామని థియోటర్‌లోకి తీసుకెళ్లారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి ఫిట్స్ రావటంతో పరిస్థితి బాగోలేదని ఆదోనికి పంపించారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందింది. సాయంత్రం నర్సింగ్ హోం దగ్గరకు మృతదేహం రావటంతో పెద్ద సంఖ్యలో బంధువులు చేరుకుని ఆందోళన చేపట్టారు. అయితే పెద్ద ఎత్తున పరిహారం ఇచ్చేందుకు ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించినట్లు తెలిసింది.
అమరవీరుల సేవలు స్మరణీయం
కర్నూలు కల్చరల్: అటవీ శాఖ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని అటవీ శాఖ కర్నూలు డివిజన్ స్క్వాడ్ డీఎఫ్‌వో రవిశంకర్ అన్నారు. గురువారం అటవీ శాఖ సర్కిల్ కార్యాలయంలో జాతీయ అటవీ అమర వీరుల దినోత్సవం జరిగింది. డీఎఫ్‌వోతో పాటు కర్నూలు రేంజ్ ఎఫ్‌ఆర్‌వో విజయకుమార్, స్వ్క్వాడ్, సోషల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమణారెడ్డి, సర్కిల్ కార్యాలయం ఏవోలు అబ్దుల్ సుభాన్, షానవాజ్, డివిజన్ కార్యాలయం ఏవో మహమ్మద్ ఏషన్, అటవీ శాఖ ఉద్యోగులు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్క్వాడ్ డీఎఫ్‌వో రవిశంకర్ మాట్లాడుతూ కర్నులు సర్కిల్ పరిధిలో 23 మంది అటవీ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో అమరులయ్యారన్నారు. వారి సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులు అడవుల సంరక్షణ బాధ్యతను మరువకూడదన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.